4 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలి

9 Sep, 2016 01:55 IST|Sakshi
4 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలి

కృష్ణా జలాలపై ట్రిబ్యునల్‌లో ఏపీ వాదన
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలోని సెక్షన్-89 పరిధిపై కృష్ణా ట్రిబ్యునల్‌లో తుది వాదనలు పూర్తయ్యాయి. కృష్ణా నదీజలాల్ని పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలమధ్య పంపిణీ చేయాలా? లేక రెండు తెలుగు రాష్ట్రాలమధ్యే పంపకాలు చేయాలా? అన్న వివాదంపై గురువారం వాదనలు ముగి శాయి. తీర్పును మూడు వారాల తరువాత ప్రకటిస్తామని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఏపీ విభజన చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఆస్తులు పంచినట్టే.. కృష్ణా జలాల్నీ పంపిణీ చేయాలని కేంద్రం బుధవారం వాదించగా..

ఈ వివాదాన్ని ఏపీ, తెలంగాణలకే పరిమితం చేసే అధికారం కేంద్రానికికానీ, సుప్రీంకోర్టుకు కానీ లేదని, నీటి వివాదాల్లో సర్వాధికారాలు ట్రిబ్యునల్‌కే ఉన్నాయని తెలుగు రాష్ట్రాలు స్పష్టం చేయడం తెలి సిందే. గురువారం ట్రిబ్యునల్ ముందు ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం నీటి కేటాయింపులను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని పార్లమెంటు భావించి ఉంటే ట్రిబ్యునల్‌ను ప్రస్తావించకపోయేదన్నారు.

రెండేళ్లుగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక పరిధిలోని రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలుండగా.. దిగువ నున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అడుగంటాయన్నారు. ఇవి రెండూ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టులన్నారు. కర్ణాటక చెబుతున్నట్టుగా కృష్ణాజలాల కేటాయింపుల్ని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడం సరికాదని, నాలుగు రాష్ట్రాలమధ్య చేపడితేనే ఏపీ, తెలంగాణలకు న్యాయం జరుగుతుందన్నారు.
 
గోదావరినీ తీసుకుందామా..?
కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది నారిమన్ వాదిస్తూ.. ‘‘ఏపీని విభజన చేస్తున్నట్టు 2009లోనే ప్రకటన వెలువడింది. అయితే కృష్ణా నీటికేటాయింపులకు సంబంధించి ట్రిబ్యునల్ 2010లో తీర్పు వెలువరిం చింది. తరువాత దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా.. ట్రిబ్యునల్‌లో తిరిగి వాదనలు ప్రారంభమైనా ఏపీ, తెలంగాణల నుంచి ఏ ఒక్కరూ అభ్యంతరాలు లేవనెత్తలేదు. ఇప్పుడు కొత్తగా అభ్యంతరాలు లేవనెత్తడమేంటి?’’ అని ప్రశ్నించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 4కు, విభజన చట్టంలోని సెక్షన్-89కు సంబంధం లేదన్నారు. సెక్షన్-89 రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతుందన్నారు. ఏపీ వాదిస్తున్నట్టు ఈ చట్టం ప్రకారం కృష్ణాజలాల్ని నాలుగు రాష్ట్రాలమధ్య పంపిణీ చేయాలంటున్నారు కాబట్టి.. ఇలాగైతే గోదావరి జలాల్నీ ట్రిబ్యునల్ పరిధిలోని తేవాలని, అప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలన్నీ నీటిపంపకాలకోసం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా