జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45శాతం ఓటింగ్ నమోదు

2 Feb, 2016 19:08 IST|Sakshi
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45శాతం ఓటింగ్ నమోదు

హైదరాబాద్ : ఇప్పటివరకూ తమకు అందిన సమాచారం ప్రకారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం సాయంత్రం ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఇంకా రెండు లేదా మూడు శాతం ఓటింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు.  గతంలో కంటే స్వలంగా ఓటింగ్ శాతం పెరిగినట్లు చెప్పారు. 2 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టామని..  లైవ్ వెబ్ కాస్టింగ్ పెట్టడం వల్ల ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెప్పారు. ఎక్కడ ఏ చిన్న సమాచారం వచ్చినా పోలీసులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు.

గ్రేటర్ పరిధిలో ఎక్కడా హింసాత్మక ఘటనలు, పోలింగ్ బూత్లను ఆక్రమించడం జరగలేదని కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు ఉదయం పోలింగ్ మొదలైన అరగంటలో కేవలం ఎనిమిది ఈవీఎంలు మొరాయించాయని, అయితే  పది నిమిషాల్లోనే వాటిని సరిచేయడం జరిగిందన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ బాగానే జరిగిందని, ఒకటి, రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. ఎంఐఎం, కాంగ్రెస్ గొడవపై ప్రిసైడింగ్ అధికారి నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్కు నివేదిస్తామని కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు