అట్టహాసంగా...

8 Nov, 2014 23:54 IST|Sakshi
అట్టహాసంగా...

జంట జిల్లాల్లో 5,500 మందికి పింఛన్ల పంపిణీ
హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు.
పూర్తిగాని లబ్ధిదారుల ఎంపిక, కొనసాగుతున్న పరిశీలన
నిలదీత, విజ్ఞప్తులతో గందరగోళం

 
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ‘ఆసరా’ పథకం కింద శనివారం 5,500 మంది వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు.
 
ఆసరా పథకం కింద నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడంతో కార్యక్రమం ఆర్భాటంగా సాగింది. గతంలో పింఛన్లు పొందిన వారితోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారంతా రావడంతో సందడి నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవంటూ అక్కడక్కడా పలువురు ఆందోళన వ్యక్తం చేయడంతో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని సంతృప్తి పరచడానికి అధికారులు నానా హైరానా పడాల్సి వచ్చింది. పింఛన్లు మంజూరు గాని వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని... గతంలో మాదిరిగా పింఛన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు. తొలి దశలో భాగంగా నగరంలో 12 వేల పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 14 మండలాల్లో శనివారం 3,500 సామాజిక పింఛన్లు పంపిణీ చేసినట్టు కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఆదివారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండు వేలకుపైగా పింఛన్లు పంపిణీ చేసినట్టు అధికారుల పేర్కొంటున్నారు.
 
పథకాన్ని ప్రారంభించిన నేతలు...

సైదాబాద్ మండలం బాల రావమ్మ బస్తీలో, చార్మినార్ మండలం బండ్లగూడలోని బహదూర్‌పురా ప్రాంతాల్లో ఆసరా పథకాన్ని డిప్యూటీ సీఎం మహముద్ అలీ లాంఛనంగా ప్రాభించారు. ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంబర్‌పేట్, ముషీరాబాద్, నాంపల్లి మండలాల్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు.  గోల్కొండలో ఎమ్మెల్యే కౌసర్ మోయినొద్దీన్, అమీర్‌పేట్‌లో ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్, హిమాయత్‌నగర్‌లో ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆఫిస్‌నగర్‌లో ఎమ్మెల్యే జాఫర్ హూస్సేన్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు.
 
 

మరిన్ని వార్తలు