అటవీ సిబ్బంది అంటూ బురిడీ.. ఐదుగురు అరెస్ట్

13 Apr, 2016 23:19 IST|Sakshi

హయత్‌నగర్: యువతీ, యువకులను బెదిరించి నగలు, సెల్‌ఫోన్‌లు, కెమెరాలు అపహరించుకపోయిన ఐదుగురు దొంగల ముఠా సభ్యులను బుధవారం హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... సరూర్‌నగర్‌కు చెందిన ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసించే ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు ఈ నెల 5న తట్టిఅన్నారం పరిధిలోని వనస్థలిహిల్స్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. మన్సూరాబాద్‌కు చెందిన అబ్ధుల్ ఖాదర్ కొడుకు అబ్ధుల్‌బైరి, బాతుని వెంకటేష్ కుమారుడు సునీల్, కొంగర్ ఆంజనేయులు కొడుకు శివప్రసాద్, రాయపురం స్వామి కొడుకు రాజశేఖర్, శ్రీరాముల నర్సింహ్మ కొడుకు నవీన్‌లు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వారి వద్దకు వెళ్లి అటవీశాఖ సిబ్బంది మంటూ బెదిరించారు.

వారిని భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుంచి బంగారు నగలు, సెల్‌ఫోన్‌లు, కెమెరా, రెండు వాచీలు లాక్కున్నారు. దీంతో బాధితులు ఈ నెల 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన మూడు బంగారు గొలుసులు, ఒక రింగు, ఐదు సెల్‌ఫోన్‌లు, ఒక కెమెరా, రెండు వాచీలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు