గృహ రుణాలపై 6.5 శాతం వడ్డీ రాయితీ

6 Mar, 2016 04:54 IST|Sakshi
గృహ రుణాలపై 6.5 శాతం వడ్డీ రాయితీ

సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)-హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద పేద, మధ్య తరగతి కుటుంబాలకు 6.5 శాతం వడ్డీ రాయితీపై గృహ రుణాల ను బ్యాంకులు, ఇతర గుర్తింపు పొం దిన ఆర్థిక సంస్థల ద్వారా మంజూరు చేయనున్నాయని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఎండీ, సీఈవో శ్రీరాం కల్యాణరామన్ పేర్కొన్నారు. పీఎంఏవైలో అంతర్భాగమైన క్రెడిట్ లింక్‌డ్ సబ్సిడీ స్కీం అమలుపై శనివారం నగరంలోని ఓ హోటల్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథి గా ఆయన పాల్గొన్నారు.

పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం అమలుకు ఎన్‌హెచ్‌బీ నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుందన్నారు. రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం గల బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల లోపు వార్షిక ఆదాయం గల తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలు (ఎల్‌ఐజీ) ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులని చెప్పారు. 15 ఏళ్ల నెల వారీ వాయిదాలకు గరిష్టంగా రూ.2.20 లక్షల వరకు వడ్డీ రాయితీని ఈ పథకం కింద మంజూరు చేస్తామన్నారు. గరిష్టంగా రూ.6 లక్షల వరకే వడ్డీ రాయితీ వర్తిస్తుందని, మిగిలిన రుణ మొత్తానికి సాధారణ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

 జూన్‌లోగా రూ.20 వేల కోట్ల రుణాలు
పీఎంఏవై రుణాల పంపిణీకి రూ.20 వేల కోట్ల నిధులను వచ్చే జూన్ 31లోగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు విడుదల చేయనున్నట్లు శ్రీరాం కల్యాణరామన్ తెలిపారు. ఈ మొత్తాన్ని ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లబ్ధిదారులకు రుణాలుగా విడుదల చేస్తాయన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనే ఈ రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పురపాలక శాఖ కమిషనర్, డెరైక్టర్ దానకిశోర్, ఎస్‌బీహెచ్ సీజీఎం వి.విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు