సిద్దిపేటలో 6 పంచాయతీల విలీనం

14 Feb, 2016 00:55 IST|Sakshi

20న వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్!
మార్చి 5న ఎన్నికలు

 
 సాక్షి, హైదరాబాద్:  సిద్దిపేట శివారుల్లో ఉన్న హనుమాన్‌నగర్, ప్రశాంత్‌నగర్, నర్సాపూర్, తాడిచర్లపల్లి, ఇమామ్‌బాద్, రంగనాథ్‌పల్లి గ్రామ పంచాయతీలను సిద్దిపేట మునిసిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆరింటి గ్రామ పంచాయతీల హోదాను రద్దు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. వాస్తవానికి సిద్దిపేట మునిసిపాలిటీలో ఈ గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ 2012లోనే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండానే విలీనం చేశారంటూ స్థానికులు పిటిషన్ దాఖలు చేయడంతో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఆరు గ్రామాల్లో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. స్టే తొలగింపు కోసం ప్రభుత్వం సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలోని డివిజన్లు/వార్డుల రిజర్వేషన్లను ప్రకటిస్తూ సోమవారంగాని, మంగళవారంగాని ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ మేరకు 20న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ నాలుగు పురపాలికల ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. మార్చి 5న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

మరిన్ని వార్తలు