పీఎఫ్ సొమ్ముపై పన్నుకు 10న నిరసన

7 Mar, 2016 19:35 IST|Sakshi

హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో జమయిన నగదును వెనక్కు తీసుకునే సమయంలో 60 శాతం మొత్తంపై పన్ను వేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రతిపాదించడాన్ని సీఐటీయూ, ఏఐటీయూసీ తీవ్రంగా ఖండించాయి. ఈ ప్రతిపాదనపై ఈనెల పదిన ఫ్యాక్టరీలు, పని ప్రదేశాల వద్ద ధర్నాలు నిర్వహించాలని సీఐటీయూ పిలుపివ్వగా పన్ను ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించేంత వరకూ ఆందోళన చేయాలని కార్మికలోకానికి విజ్ఞప్తి చేసింది. కార్మిక సంఘాల వత్తిడితో కేంద్రప్రభుత్వం పన్ను ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతోందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

కార్మికులు ఆరుగాలం కష్టపడి దాచుకున్న సొమ్మును పన్ను రూపంలో కాజేసేందుకు జరిగే కుయుక్తులను ప్రతిఘటింటేందుకు 10న ధర్నా చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం గత రెండేళ్లలో బడా పారిశ్రామిక వేత్తలకు వేలాది కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చిందని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు ధ్వజమెత్తారు. పేదల కడుపు కొట్టి బ్యాంకుల్ని ముంచేసే పెద్దలకు రాయితీలు ఇస్తారా? అని ప్రశ్నించారు. పీఎఫ్ సొమ్ముపై అరుణ్‌జెట్లీ చేసిన ప్రతిపాదనను విరమించేంత వరకూ పోరాడాలని నిర్ణయించినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు