ఎట్టకేలకు 60 ఏళ్లకు ఓకే

10 Jan, 2016 01:51 IST|Sakshi

♦ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులపై ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం
♦ పాలకవర్గ తీర్మానాలు పంపాలంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు
♦ అన్ని సంస్థల తీర్మానాలు వచ్చిన తర్వాత తుది నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ మేరకు తీర్మానాలు చేసి పంపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచే విషయంపై పాలకవర్గ తీర్మానాలు చేసి పంపించాలని తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంస్థలను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కిందట ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొంత మంది తాము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల ఉద్యోగులమేనని, తమకూ పదవీ విరమణ వయసును పెంచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు.. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులను వేర్వేరుగా చూడటానికి వీలు లేదు. తుది తీర్పు వెల్లడించేలోపు పదవీ విరమణ చేయాల్సిన ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులను కొనసాగించండి’ అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆర్థికశాఖ పై ఆదేశాలు జారీ చేసింది.పాలకవర్గాలు తీర్మానాలు పంపాక కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేస్తుందని అధికార వర్గాల సమాచారం.

మరిన్ని వార్తలు