కిలోకు 600 గ్రాములే!

29 Jan, 2018 02:01 IST|Sakshi
వేయింగ్‌ మిషన్‌ను పరిశీలిస్తున్న అధికారులు

నగర వ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులు

సాక్షి, హైదరాబాద్‌: తూనికలు, కొలతల శాఖ కొరడా ఝళిపిస్తోంది. నగర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వరుస దాడులతో అక్రమ తూకాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ‘సాక్షి’ ప్రధాన సంచికలో మూడు రోజుల క్రితం ‘తూచేస్తున్నారా.. దోచేస్తున్నారా..?’ అనే పతాక శీర్షికతో ప్రచురితమైన కథనానికి తూనికలు, కొలతల శాఖ తీవ్రంగా స్పందించింది. ఆ శాఖ రాష్ట్ర కంట్రోలర్‌ సీవీ ఆనంద్‌ తూకాల మోసాలపై తనిఖీల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. మొదటిరోజు కూరగాయల మార్కెట్లపై దాడులు నిర్వహించగా, రెండో రోజు చేపలు, మాంసం మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమ తూకాల వ్యాపారులపై సుమారు 62 కేసులు నమోదు చేశారు.  

చేపల మార్కెట్‌లో కిలోకు 600 గ్రాములు 
నగరంలోని రామ్‌నగర్‌ చేపల మార్కెట్‌లో హైదరాబాద్‌ ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్‌ విమల్‌ బాబు నేతృత్వంలో అధికారుల బృందం ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించి తూకాలు తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఒక చేపల షాపులో ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మిషన్‌ను పరిశీలించగా అందులో సెట్టింగ్‌ (చేతివాటం) బయటపడింది. కిలోకు 400 గ్రాములు తక్కువగా తూకం వస్తున్నట్లు వెల్లడైంది. దీంతో అధికారులు ఆ షాపు యాజమానిపై కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశ పెట్టేందుకు పోలీసులకు అప్పగించారు. మరో ఐదు షాపుల తూకాలను తనిఖీ చేయగా కిలోకు 200 గ్రాములు తక్కువ వస్తున్నట్లు వెల్లడవడంతో కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. 

స్టాంపింగ్‌ లేకుండా తూకాలు 
జియాగూడ హోల్‌సేల్‌ మాంసం మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ స్టాంపింగ్‌ లేని ఎలక్ట్రానిక్‌ కాంటాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌ సిటీ తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌జీ భాస్కర్‌ రెడ్డి నేతృత్యంలోని బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా సుమారు 23 మంది వ్యాపారులు తమ ఎలక్ట్రానిక్‌ కాంటాలకు శాఖాపరమైన ఆమోదముద్ర వేయకుండానే వినియోగిస్తున్నట్లు బయటపడింది. దీంతో వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు. తూనికలు, కొలతల శాఖ ప్రత్యేక బృందాలు నగరంలోని గుడిమల్కాపూర్, బోయినపల్లి, కొత్తపేట, ఎన్టీఆర్‌ నగర్‌ మార్కెట్లలో తనిఖీలు చేసి ఎలక్ట్రానిక్‌ కాంటాలు, తూకాల్లో మోసాలున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా 33 కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించారు. 

తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు 
నగరంలోని మార్కెట్లపై తనిఖీల కోసం ముగ్గురు అధికారుల నేతృత్వంలో మూడు బృందాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌ ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్‌ విమల్‌ బాబు నేతృత్వంలో ఒక బృందం, హైదరాబాద్‌ రీజియన్‌ డిప్యూటీ కంట్రోలర్‌ వి. శ్రీనివాస్‌ నేతృత్వంలో మరో బృందం, హైదరాబాద్‌ సిటీ తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌జీ భాస్కర్‌ రెడ్డి నేతృత్యంలో మూడో బృందం ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నాయి.

మరిన్ని వార్తలు