64 ప్రాంతాలు.. 100 కి.మీ

8 Aug, 2016 22:34 IST|Sakshi
తనిఖీలు చేస్తున్న అధికారులు

► వైట్‌టాపింగ్‌ రోడ్ల కోసం
► అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
► అవరోధాల తొలగింపుపై అధ్యయనం


సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వైట్‌టాపింగ్‌ రోడ్లు నిర్మించేందుకు అవసరమైన రహదారులను గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీతో పాటు జలమండలి, విద్యుత్‌ తదితర విభాగాల ఉన్నతాధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో రహదారులను పరిశీలించారు. పైలట్‌ ప్రాజెక్టుగా వంద కిలోమీటర్లలో వైట్‌టాపింగ్‌రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో 64  ప్రాంతాల్లో 100 కి.మీ.ల రోడ్లు వేయాలని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో అధికారులు లిబర్టీ, బషీర్‌బాగ్, ఆబిడ్స్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, డబీర్‌పురా, సైదాబాద్, డీఆర్‌డీఎల్, కంచన్‌బాగ్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లోని తనిఖీలు నిర్వహించి ఆయా మార్గాల్లో తొలగించాల్సిన మంచినీటి, సివరేజి పైప్‌లైన్లు, విద్యుత్‌ లైన్లు ఇబ్బందులపై చర్చించారు.  ఈ సందర్భంగా  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తొలుత ఎలాంటి ఆటంకాలు లేని మార్గాల్లో పనులు చేపడతాన్నారు. ప్రతి రోడ్డుకు సంబంధించిన డీపీఆర్‌లను సిద్ధం చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో తాగునీరు, సివరేజి లైన్లు, కేబుళ్లకు అవసరమైన డక్ట్‌లు , వరద కాలువలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు రామేశ్వరరావు, సతీష్, సురేష్‌కుమార్, సుభాష్‌సింగ్, ఎస్‌ఈ అశ్వనీకుమార్‌ తదితరులు ఉన్నారు.


వివిధ పనుల తనిఖీ..
 ఈ పర్యటనలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ మార్గమధ్యంలో పారిశుధ్య పనులు, రోడ్ల మరమ్మతులు, వ్యాపార దుకాణాల్లో ట్రేడ్‌ లైసెన్సులు తదితరమైనవి కూడా తనిఖీ చేశారు. అలియాబాద్‌లో బియ్యం విక్రయదారులకు ట్రేడ్‌లైసెన్సు లేకపోవడం గుర్తించి సదరు మార్గంలోని దుకాణాలన్నీ తనిఖీచేసి ట్రేడ్‌ లైసెన్సులు లేనివారికి వాటిని జారీ చేయాలని స్థానిక డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.

మరిన్ని వార్తలు