రాజధాని రోడ్లకు 693 ఎకరాల భూ సేకరణ

10 Aug, 2015 20:03 IST|Sakshi
రాజధాని రోడ్లకు 693 ఎకరాల భూ సేకరణ

సాక్షి, హైదరాబాద్: సీడ్ కేపిటల్ ప్రాంతంలో విశాలమైన రోడ్లను నిర్మించేందుకు 693 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం తేల్చింది. రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూములు కాకుండా కేవలం రోడ్ల విస్తరణకు 277.27 హెక్టార్లు (693 ఎకరాలు) కావాలని భావిస్తోంది. సింగపూర్ ప్రణాళికను అనుసరించి విజయవాడ నుంచి అమరావతి వరకూ, మంగళగిరి నుంచి అమరావతి వరకూ మొత్తం 88 కి.మీ. మేర ఐదు కేటగిరీలుగా రోడ్లను నిర్మించేందుకు కసరత్తు మొదలైంది.

ఇందుకు కన్సల్టెన్సీల సేవలు వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్ల విస్తరణకు అవసరమైన ఫీజిబిలిటీ, డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు) కన్సల్టెన్సీ సంస్థలు అందించాల్సి ఉంటుంది. రోడ్ల విస్తరణలో ఎక్కడెక్కడ ఆర్వోబీలు, ఫై్ల ఓవర్లు నిర్మించాలి.. భూ సేకరణ ఎంత చేపట్టాలి అనే అంశాలను అధ్యయనం చేసి కన్సల్టెన్సీ సంస్థలు నివేదిక రూపొందించాల్సి ఉంటుంది.

రోడ్ల విస్తరణకు సర్వే, గ్రామాల మ్యాప్‌లు, మట్టి స్థితి గతులతో కూడిన సమగ్ర అధ్యయనం కన్సల్టెన్సీలు చేపట్టాలి. కన్సల్టెన్సీ సేవలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనుంది. రాజధాని సీడ్ ప్రాంతంలో రోడ్లను 60 మీటర్లు, 40 మీటర్లు, 25 మీటర్లుగా విస్తరించనున్నారు. డిజైన్ 2016 జూన్ నాటికి పూర్తి చేసి, 2017 సంవత్సరం ఆఖరు నాటికి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సీడ్ కేపిటల్‌లో 34 కిలోమీటర్ల ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 12 కి లోమీటర్ల మేర మెట్రో రైలు, 15 కి లోమీటర్ల మేర బీఆర్‌టీ, 7 కిలోమీటర్ల మేర జలరవాణా వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు అధ్యయనానికి కన్సల్టెన్సీ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది.
 

మరిన్ని వార్తలు