ఇదేం పని తాతా!

2 Jul, 2015 16:44 IST|Sakshi
ఇదేం పని తాతా!

హైదరాబాద్: నగరంలో ఈవ్ టీజింగ్ నిరోధానికి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. బుధవారం షీ టీమ్స్ దాడులు చేసి వివిధ ప్రాంతాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వీరిలో 71 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి కూడా ఉండటం గమనార్హం. నిజామాబాద్ జిల్లా అర్మూర్ మండలం వాల్మీకినగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి మహమ్మద్ సాధిక్ ఆలీ (71) కోఠి బస్టాప్‌లో మహిళలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని గుర్తించిన షీటీమ్ సభ్యులు అతడి వెకిలిచేష్టలను వీడియో తీయడమే గాక నిందితుడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా కోర్టు అతనికి రెండు రోజుల కస్టడీ విధించింది.

మరో ఘటనలో గత ఆరునెలలుగా ఓ మహిళను వేధిస్తున్న ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన బి.రాములును అఫ్జల్‌గంజ్ బస్టాండ్‌లో షీటీమ్ సభ్యులు అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఐదు రోజుల కస్టడీ విధించారు. వీరితోపాటు మహిళలను వేధిస్తున్న మెదక్ జిల్లా రామచంద్రపురం కొల్లూరు గ్రామానికి చెందిన మహమ్మద్ మోసిన్, మెహిదీపట్నంలో ఉంటున్న బీహర్‌కు మహమ్మద్ ఇస్తియాక్‌లను ఆధారాలతో సహా అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని వార్తలు