అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లిస్తే 8 శాతం రాయితీ

19 Mar, 2016 03:34 IST|Sakshi
అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లిస్తే 8 శాతం రాయితీ

వాణిజ్య పన్నుల సబ్ కమిటీ నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: ముందస్తు పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చే పరిశ్రమలకు అవి చెల్లించే పన్నులో 8 శాతం రాయితీ ఇవ్వాలని వాణిజ్యపన్నులపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం (సబ్ కమిటీ) నిర్ణయించింది. 2016 ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా రూ. 252 కోట్ల మేర వార్షికాదాయం సమకూరుతుందని అంచనా వేసింది. వాణిజ్య పన్నుల శాఖ పనితీరుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైంది. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావుతో పాటు ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రతి జిల్లాకో డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల పన్నుల వసూళ్లు మరింత వేగవంతమవుతాయని, జీరో దందా తగ్గుతుందని మంత్రులు అభిప్రాయపడ్డట్టు సమాచారం. అవసరమైతే ఇద్దరు ఐఏఎస్ అధికారులను డీసీ హోదాలో నియమించాలని కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ- ఆంధ్ర సరిహద్ధుల్లో ఉన్న ఏడు కొత్త చెక్‌పోస్టులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న మరో ఏడు చెక్‌పోస్టులను ఏకకాలంలో ఆధునీకరించేందుకు టెండర్లు పిలవాలని, భూసేకరణతో పాటు నిర్మాణం పూర్తి చేసి వాటి నిర్వహణ బాధ్యతలు కూడా ఆయా సంస్థలకే బీవోటీ పద్ధతిలో ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు.   అదనపు సిబ్బందిని నియమించాలన్న అధికారుల కోరిక మేరకు ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ ద్వారా నియమించుకోవడం, అవసరమైతే సర్వీస్ కమిషన్ నుంచి నియామకాలు చేపట్టేందుకు ఉపసంఘం అనుమతిచ్చింది. మొజాంజాహి మార్కెట్‌లోని మార్కెటింగ్ శాఖకు చెందిన భవనం, బంజారాహిల్స్‌లోని నీటిపారుదల శాఖ భవనాలను వాణిజ్యపన్నుల శాఖకు అద్దెకిస్తామని మంత్రి హరీశ్‌రావు కమిటీ సభ్యులకు సూచించారు. సనత్‌నగర్‌లో కాలుష్య నియంత్రణమండలి స్థలం కూడా అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు.

మరిన్ని వార్తలు