వెంటాడే పీడకల

25 Aug, 2015 10:44 IST|Sakshi
లుంబినీ పార్కులో మృతులకు నివాళులు అర్పిస్తున్న దృశ్యం (పాతచిత్రం)

 గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్లకు ఎనిమిదేళ్లు  

 సుల్తాన్‌బజార్: కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుందంటారు.. కానీ ఎనిమిదేళ్లు గడిచినా ‘జంట పేలుళ్ల’ ఘటనను మాత్రం ప్రజలు మరిచిపోలేక పోతున్నారు. నిద్దురలోనూ ఉలికిపడుతున్నారు. 2007లో ఆగష్టు 25న సాయంత్రం 7.45 గంటలకు కోఠిలోని గోకుల్ చాట్, లుంబినీ పార్కు లేజర్ షో చూస్తున్నవారిపై ఐఎస్‌ఐ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు విసిరిన పంజా విసిరారు. ఈ ఘటనలో 44 మంది అమాయకులు బలయ్యారు. ఈ దుర్ఘటన జరిగి నేటికి ఎనిమిదేళ్లు. ఇన్నేళ్లు గడిచినా స్థానికుల్లో ఇంకా భయం వీడలేదు. జంట బాంబు పేలుళ్లలో చనిపోయినవారి కుటుంబాలకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి బాధితులకు భరోసా కల్పించారు. ైవె ఎస్ అకాల మరణంతో కొంతమంది బాధితులకు నేటికీ న్యాయం జరగలేదు. నాయకులు ఏటా ఈ ప్రాంతాలకు వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు గాని బాధితులకు సాయం మాత్రం చేయడంలేదు. ప్రతి సంవత్సరం కోఠిలోని గోకుల్ చాట్‌కు బాధితులు వచ్చి వైఎస్సార్ బతికుంటే తమకు న్యాయం జరిగేదని కన్నీరు పెట్టుకోవడం పరిపాటిగా మారింది. నేటి పాలకులైనా జంట పేలుళ్లలో మృతిచెందిన కుటుంబాలను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. జంట పేలుళ్లలో చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని గత ఏడేళ్లుగా గోకుల్‌చాట్ యాజమాని ప్రేంచంద్ విజయవర్గి దుకాణాన్ని బంద్ చేస్తున్నారు. మంగళవారం సైతం గోకుల్‌చాట్ బంద్ ఉంటుందని ఆయన తెలిపారు.

 ఆ శబ్దం నేటికీ ప్రతిధ్వనిస్తోంది
 
 ఆనాడు గోకుల్‌చాట్‌లో జరిగిన బాంబు పేలుడు శబ్దం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. అ సమయంలో నేను వెనుక వైపు ఉండడంతో బతికి బయటపడ్డాను. ఎక్కడ ఏ శబ్దం విన్నా ఆ బాంబు పేలుళ్ల శబ్దాలే గుర్తుకువచ్చి గుండె జల్లుమంటుంది. ఇలాంటి ఘటనతో మేము ప్రైవేటు సెక్యూరిటీతో పాటు ఎలక్ట్రానిక్ నిఘా ఏర్పాటు చేసుకున్నాం. ఆనాటి భయం మాత్రం పోవడంలేదు.    - ప్రేంచంద్,  గోకుల్‌చాట్ యాజమాని

 ఆ రోడ్డున వెళ్లాలంటే భయం..
 
 ఇప్పటికీ గోకుల్‌చాట్ భండార్‌కు వెళ్లాలంటే ఆనాటి ఘటన గుర్తుకు వచ్చి భయంగా ఉంటుంది. ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేలుళ్లలో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్నవారిని నా చేతులతో ఆటోలు, కార్లు, బస్సుల్లో తరలించా. కొందరు అవయవాలు తెగిపడి గిలగిలా కొట్టుకుంటూ నా చేతుల్లో ప్రాణాలు విడిచారు. ఈ ఘటనను తలచుకుంటే కన్నీళ్లు ఆగవు.  - సునీల్ బిడ్లాన్, కుత్బిగూడ

మరిన్ని వార్తలు