విటమిన్‌ 'ఢీ'

28 Jan, 2018 02:56 IST|Sakshi

గ్రేటర్‌లో 80 శాతం మందికి క్యాల్షియం లోపం

బాధితుల్లో 70 శాతం మంది మహిళలు, 56 శాతం మంది వృద్ధులు

కీళ్లు, కండరాల నొప్పులతో బాధపడుతున్న బాధితులు

ఎన్‌ఐఎన్, కేర్, దక్కన్, షాదన్‌ వైద్యుల సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ :  శేరిలింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి రాజేశ్‌ రాత్రంతా ఆఫీసులో, పగలంతా ఇంట్లో గడుపుతాడు. సికింద్రాబాద్‌కు చెందిన టీవీ యాంకర్‌ శైలజ రాత్రిపూట ఆఫీసులో విధులు నిర్వహించి పగలు ఏసీ గదిలో నిద్రపోతుంది. లేత సూర్యకిరణాలకు నోచుకోకపోవడంతో వారి శరీరాల్లో క్యాల్షియం లోపించి ఎముకలు దెబ్బతింటున్నాయి.

కేవలం రాజేశ్, శైలజ మాత్రమే కాదు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో నూటికి 80 శాతం మంది విటమిన్‌ ’డి’లోపంతో బాధపడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) నిపుణులు, కేర్, షాదన్, దక్కన్‌ ఆస్పత్రుల వైద్యులు ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బాధితుల్లో 70 శాతం మంది మహిళలు, 56 శాతం మంది వృద్ధులున్నట్లు గుర్తించింది.  

బాధితుల్లో 70 శాతం మహిళలే...
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో మహిళలకు ఇచ్చే ఆహారంపై మొదటి నుంచి వివక్ష కొనసాగుతోంది. విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా లభించే ఆహారాన్ని మగపిల్లలకు ఇచ్చి, ఆడపిల్లలకు కేవలం అన్నంతో సరిపెడుతున్నారు. వివాహిత తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా నిత్యం భర్త, పిల్లల కోసమే పనిచేస్తోంది.

గడప దాటడం లేదు. సూర్యకిరణాలు శరీరానికి తాకడంలేదు. దీంతో క్యాల్షియం లోపించి, చిన్న వయసులోనే కీళ్లనొప్పుల బారిన పడుతున్నారు. సాధారణంగా మహిళల్లో 40 నుంచి 45 ఏళ్లకు వచ్చే మేనోపాజ్‌ దశ 35 ఏళ్లకే వస్తోంది. మోనోపాజ్‌ తర్వాత శరీరంలోని క్యాల్షియం ఏటా సాధారణం కన్నా ఎక్కువ తగ్గుతుంది.

ఐటీ అనుబంధ రంగాల్లో...
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఐటీ, అనుబంధ రంగాల్లో ఏడు లక్షల మంది పనిచేస్తున్నారు. నెలలో సగం రోజులు సగం మంది పగలు పనిచేస్తే, మరో సగంమంది రాత్రిపూట పనిచేస్తున్నారు. వీరిలో నూటికి 90 శాతం మందికి సూర్యరశ్మి అంటే ఏమిటో తెలియదంటే అతిశయోక్తికాదు. సాధారణంగా మనిషి శారీరక ఎదుగుదల 20 ఏళ్లలోపే.

కానీ, 30 ఏళ్ల వరకు క్యాల్షియాన్ని నిల్వ చేసుకునే శక్తి శరీరానికి ఉంటుంది. ఆ తర్వాత పురుషులు ఏటా ఒక శాతం, మహిళలు రెండు శాతం క్యాల్షియాన్ని కోల్పోతున్నట్లు పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పరోక్షంగా ఇది హైపర్‌టెన్షన్, కార్డియో వ్యాస్కులర్‌ వంటి జబ్బులకు కారణమవుతోంది. ఎముకలు, దంతాలు పటుత్వాన్ని కోల్పోవాల్సి వస్తోంది.  


ఎముకలు దృఢంగా ఉండాలంటే...
పిల్లలకు రోజూ పావులీటరు పాలు, పెరుగు, గుడ్డు, చేపలు, మాంసం, తాజా కూరలు, డ్రైప్రూట్స్, గింజలు, నారింజ, ద్రాక్ష వంటి ఫలాలిస్తే ఎముకల పటుత్వం పెరుగుతుంది. ప్రొటీన్లు, సోడియం, కెఫిన్‌ అతిగా తీసుకోవడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి.   – డాక్టర్‌ కమల్, ఆర్థోపెడిక్‌

లేతకిరణాల మధ్య వ్యాయామం ఉత్తమం
ఉదయం ఏడు గంటల్లోపు వచ్చే సూర్యకిరణాల్లో విటమిన్‌ డి పుష్కలంగా లభిస్తుంది. ఉదయం ఏడు గంటలలోపు వ్యాయామం చేయాలి. గంటలన్నర సేపు లేత కిరణాల మధ్య గడపాలి. మధ్యాహ్నం తర్వాత నిద్రలేవడం తగదు, ఉదయం సూర్యకాంతి తగలకుండా కారులో ప్రయాణించవద్దు. శరీరంలో క్యాల్షియం తగ్గడం వల్ల ఎముకల్లో పటుత్వం తగ్గిపోయి వివిధ రకాల నొప్పులకు కారణమవుతుంది.  – డాక్టర్‌ శారద, ఫిజీషియన్‌

మరిన్ని వార్తలు