విధి ముందు తలవంచింది

10 Oct, 2016 03:02 IST|Sakshi
విధి ముందు తలవంచింది

మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి హర్షిత
- కారుణ్యమరణం కోసం గతంలో హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన తల్లిదండ్రులు
- వైద్య, ఆరోగ్య మంత్రి ఆదేశాలతో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స
- కాలేయం కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు.. ముందుకు రాని దాతలు
- చివరకు రక్తపు వాంతులు చేసుకుని..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
 
 సాక్షి, హైదరాబాద్: మృత్యువుతో కడవరకూ పోరాడిన చిన్నారి హర్షిత చివరికి విధి ముందు తలవంచక తప్పలేదు. కుమార్తె ప్రాణాలతో దక్కుతుందని ఆశించిన ఆ తల్లిదండ్రులకు చివరికి కడుపుకోతే మిగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల(జగద్గిరిగుట్టలో తాత్కాలిక నివాసం)కు చెందిన రాంచంద్రారెడ్డి, శ్యామల దంపతుల కుమార్తె హర్షిత(11) కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించగా.. వైద్యులు బాలికను పరీక్షించి కాలేయ మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు.

 కారుణ్య మరణానికి అనుమతించాలని..
 బిడ్డ ఆరోగ్య పరిస్థితి చూడలేక, ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక హర్షిత కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాంచంద్రారెడ్డి దంపతులు జూలై 14న ఎస్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. ‘మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించండి’ శీర్షికతో ‘సాక్షి’లోనూ కథనం ప్రచురితమైంది. దీంతో చిన్నారికి వైద్యం చేయించాలని హెచ్‌ఆర్సీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి వైద్య మంత్రి లక్ష్మారెడ్డి స్పందించి హర్షిత చికిత్సకయ్యే ఖర్చంతా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. కాలేయ మార్పిడికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సదరు ఆస్పత్రికి లేఖ కూడా రాశారు. ఆస్పత్రి ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది.

 రక్తపు వాంతులు: బిడ్డకు కాలేయాన్ని దాన ం చేసేందుకు తండ్రి రాంచంద్రారెడ్డి ముందుకు రావడంతో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అయితే తండ్రి కాలేయంలో ఆల్కహాల్ శాతం అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. మూడు నెలలు కాలేయ దాత కోసం ఎదురు చూసినా ఫలితం లేక పోయింది. చిన్నారి హర్షిత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత రక్తపు వాంతులు చేసుకోవడంతో చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం హర్షిత మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
 
 ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన
 హర్షిత మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమని బాధితురాలి బంధువులు, కాంగ్రెస్ నేత మల్లు రవి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కుమార్తెకు కాలేయాన్ని దానం చేసేందుకు తండ్రి ముందుకొచ్చినా వైద్యులు చికిత్సలో జాప్యం చేశారని ఆరోపించారు. హర్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, చికిత్సలో జాప్యం చేసిన వైద్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే హర్షితకు చికిత్స అందించడంలో వైద్య పరమైన నిర్లక్ష్యం ఏమీ లేదని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేయించినా.. దాతలు దొరక్కపోవడం వల్లే కాలేయ మార్పిడి చికిత్స చేయలేకపోయామని వివరించింది.

మరిన్ని వార్తలు