బ్యాంకూ.. బొమ్మనోట్లు!

15 Mar, 2017 03:40 IST|Sakshi
బ్యాంకూ.. బొమ్మనోట్లు!

బొమ్మ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్‌ చేయబోయిన ఓ వ్యక్తి
ఆర్‌బీఐ అని ఉండాల్సిన చోట చిల్డ్రన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
అనుమానంతో నోట్లను పరిశీలించిన బ్యాంకు అధికారులు
దేవదూత చెప్పిందంటూ నిందితుడి వాదన


హైదరాబాద్‌: అక్కడా.. ఇక్కడా.. ఎందుకనుకున్నాడో ఏమో.. బొమ్మ కరెన్సీని మార్చడానికి బ్యాంకుకే వెళ్లాడో ఘనుడు. పెద్దమొత్తంలో డిపాజిట్‌ చేయబోయి.. బ్యాంకు అధికారులు అప్రమత్తమవ్వడంతో పోలీసులకి చిక్కాడు. అదేమంటే ‘దైవ దూత చెప్పింది.. తాను పాటించా’నంటూ పోలీసులకూ ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. మల్కా జిగిరి అలహాబాద్‌ బ్యాంక్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటన అలజడి రేపింది.

బేగంబజార్‌లో కొని... బ్యాంకులో డిపాజిట్‌!
మౌలాలీ ప్రగతినగర్‌కు చెందిన షేక్‌ యూసుఫ్‌ (40) ఎస్పీనగర్‌ ప్రాంతంలో స్టేషనరీ దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరికి 5 దుకాణాలతో కూడిన ఇల్లు ఉన్న ప్పటికీ... భార్య, కుటుంబీకులకు దూరమయ్యాడు. ప్రతి నెలా అన్నదమ్ములు వచ్చి దుకాణాల అద్దెలు వసూలు చేసుకువెళతారు. ఇటీవల తీవ్ర ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్న యూసుఫ్‌ మానసిక స్థితి దెబ్బతింది. తన స్టేషనరీ దుకా ణంలో విక్రయించేందుకు బేగంబజార్‌ నుంచి బొమ్మ కరెన్సీ నోట్లను యూసుఫ్‌ కొనుగోలు చేశాడు. రూ.9.9 లక్షలకు సరిపోయే రూ.100, రూ.500, రూ.2 వేల బొమ్మ కరెన్సీ బండిల్స్‌ను యూసుఫ్‌ మంగళవారం గాయత్రీనగర్‌లోని అలహా బాద్‌ బ్యాంక్‌కు తీసుకెళ్లాడు. తన ఖాతాలో ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేస్తున్నట్లు ఓచర్‌ రాసి క్యాషియర్‌కు ఇచ్చాడు. సందేహం వచ్చిన క్యాషియర్‌ వాటిని పరిశీలిం చగా... రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని ఉండాల్సిన చోట చిల్డ్రన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని ఉండటం, నాణ్యత తక్కువగా ఉండటాన్ని గుర్తించారు.

డిపాజిట్‌ చేస్తే కష్టాలు తీరతాయని...: క్యాషియర్‌ ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్‌ రవికాంత్‌ గైక్వాడ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశా రు. టాయ్‌ కరెన్సీతో పాటు యూసుఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మల్కాజ్‌గిరిలో నకిలీ నోట్లు దొరికాయంటూ చానళ్లలో ప్రచారం జరగడం తో రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. యూసుఫ్‌ ను విచారించారు. తనకు దేవదూత కలలో కనిపించి, బొమ్మకరెన్సీ బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే తన కష్టాలు తీరతాయంటూ బోధ చేసిందని యూసుఫ్‌ చెప్పుకొచ్చాడు. దీంతో అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని భావిస్తున్న పోలీసులు కేసును ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంతో కంగుతిన్న స్టేషనరీ దుకాణ నిర్వాహకులు కొందరు టాయ్‌ కరెన్సీని పిల్లలకు అమ్మే ముందు దానిపై పెన్నుతో అడ్డంగా గీతగీసి ఇవ్వడం గమనార్హం.

మరిన్ని వార్తలు