వీఆర్‌ఏల ‘వేతన’ వ్యథ..!

25 Apr, 2016 04:12 IST|Sakshi
వీఆర్‌ఏల ‘వేతన’ వ్యథ..!

♦ పేరుకే ప్రభుత్వ ఉద్యోగం..
♦ కనీస వేతనం మాత్రం లేదు
♦ రూ.6 వేల నెల వేతనంతో సేవలందిస్తున్న 24 వేల మంది
♦ కనీస పేస్కేలు వర్తింప చేయాలని,పదోన్నతుల కోటా పెంచాలని డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. కనీస వేతనం మాత్రం లేదు.. ఇస్తామన్న వేతనమైనా నెలనెలా రాదు. ఆ వచ్చేది కూడా వరద బాధితుల పద్దులోంచే. నాడు అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చేటపుడు పార్ట్‌టైమ్ ఉద్యోగమే అన్నారు. కానీ, ఇప్పుడు ఫుల్‌టైమ్ పని చేయిస్తున్నారు. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తోన్న 24 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) వేతన వ్యథ. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు చేర్చడంలో, గ్రామాల్లోని భూముల పరిరక్షణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ, తమ బాధలను ప్రభుత్వ పెద్దలుగానీ, ఉన్నతాధికారులుగానీ పట్టించుకోవడం లేదని వీఆర్‌ఏలు వాపోతున్నారు.

తెలంగాణ ఏర్పడితే తమ కష్టాలు తొలిగిపోతాయని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని, అయితే రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా వీఆర్‌ఏల దుస్థితి గురించి పాలకులు పట్టించుకోవడం లేదని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆరోపిస్తోంది. చాలీచాలని వేతనాలతో తమ కుటుంబాలను పోషించలేని పరిస్థితి నెలకొందని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వీఆర్‌ఏల సంఘం(డెరైక్ట్ రిక్రూట్‌మెంట్) ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

 విద్యావంతులే వీఆర్‌ఏలుగా..
 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ కనీస విద్యార్హతతో వీఆర్వో, టెన్త్ విద్యార్హతతో వీఆర్‌ఏ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీలు, పీజీలు(ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్‌సీ, బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సులు) చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు వీటికి దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్షలో ప్రతిభ కనబరిచిన కొంతమంది వీఆర్వోలుగానూ, మరికొంత మంది వీఆర్‌ఏలుగానూ నియమితులయ్యారు. వీఆర్‌ఏల నియామకాల సమయంలో పార్ట్‌టైమ్ ఉద్యోగమే కనుక నెలకు రూ.3 వేలు చొప్పున వేతనం ఇచ్చిన ప్రభుత్వం, వారు ఆందోళన చేయడంతో దానిని రూ.6 వేలకు పెంచింది. అయితే.. రెవెన్యూ వ్యవస్థలో పెరిగిన పనిభారం, మండల స్థాయిలో సిబ్బంది కొరత కారణంగా వీఆర్‌ఏలకు అదనపు పనులను అప్పగిస్తున్నారు. గ్రామంలో పనితో పాటు మండల, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ పూర్తిస్థాయిలో అదనపు విధులు నిర్వహిస్తున్నా వేతనం మాత్రం పెరగలేదు.
 
 పేరుకే ప్రభుత్వ ఉద్యోగం..
 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వీఆర్‌ఏలు.. పేరుకే ప్రభుత్వ ఉద్యోగులు. వారికి కనీస వేతన స్కేలును అప్పటి ప్రభుత్వం వర్తింపజేయలేదు. ఇదే రెవెన్యూ శాఖలో ఏడో తరగతి కనీస విద్యార్హతతో పనిచేస్తున్న అటెండర్ వేతనం వీఆర్‌ఏల కంటే మూడు రె ట్లు అధికంగా ఉండడం గమనార్హం. తెలంగాణ ఏర్పడినాక ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను గ్రామీణ  ప్రాంతాల్లో విజయవంతం చేయడంలో వీఆర్‌ఏలు కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన ఆసరా పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల పంపిణీ, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి తదితర పథకాలకు అర్హులను గుర్తించడంలోనూ వీఆర్‌ఏల కృషి ఎంతో ఉంది. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత ్వంగా చెబుతున్న పెద్దలు తమ బాధలను అర్థం చేసుకుని, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే వేతనాలు, సదుపాయాలు కల్పించాలని వీఆర్‌ఏలు కోరుతున్నారు.
 
 అటెండర్‌కు ఇచ్చే వేతనమైనా ఇవ్వమంటున్నాం
 మాకంటే తక్కువ విద్యార్హతతో పనిచేస్తున్న అటెండర్‌కు ఇచ్చే వేతన స్కేలును మాకూ వర్తింపజేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులై మూడేళ్లకుపైగా సర్వీసు పూర్తి చేసుకున్న వీఆర్‌ఏలకు వీఆర్వో లేదా జూనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పించాలి. వీఆర్‌ఏలకు పదోన్నతుల కోటాను 30 నుంచి 70 శాతానికి పెంచాలి. 010 పద్దు ద్వారా నెలనెలా వేతనం చెల్లించాలి.
     - ఈశ్వర్, తెలంగాణ వీఆర్‌ఏ(డెరైక్ట్ రిక్రూట్ మెంట్)ల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు