-

సిగ్గుంటే తిరిగి పోటీ చేసి గెలువ్

12 Jun, 2015 23:33 IST|Sakshi
సిగ్గుంటే తిరిగి పోటీ చేసి గెలువ్

తలసానికి కృష్ణ యాదవ్ సవాల్
 
సిటీబ్యూరో: టీడీపీ జెండాతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి... పార్టీ మారి దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టిననాయకుడు స్థాయి మరచి తమ అధినాయకుడు చంద్రబాబును విమర్శించడం తగదని హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్ పరోక్షంగా తలసాని శ్రీని వాస యాదవ్‌పై ధ్వజమెత్తారు. అధికారపు అహంకారంతో రాజ్యాంగమంటే తెలి యని, చట్టాలపై విశ్వాసం లేని వ్యక్తి చంద్రబాబును నోటికొచ్చినట్లు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అధికార ప్రతినిధి ఎం.ఆనందర్ కుమార్ గౌడ్, కార్యదర్శి నైషధం సత్యనారాయణమూర్తిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ అంటున్న ఆయనకు నిజంగా అవి ఉంటే ఒక్క సెకన్‌లో రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం, నైతిక విలువలు ఉంటే ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని ఆసరాగా చేసుకొని చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న పలువురు మంత్రులు ఎన్టీఆర్ రాజకీయ భిక్షతోనే ఈ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. తలసాని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ ఆయన ఫోన్ కాల్‌డేటాను తీయాలని, ఎవరెవరిని బెదిరించారో, ప్రలోభపెట్టారో తెలుస్తుందన్నారు. సమావేశంలో బాల్‌రాజ్‌గౌడ్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
 
కాంగ్రెస్ కొత్త నాటకం
 అనంతరం సెక్రటరీ జనరల్ ఎమ్మెన్ శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు మేకల సారంగపాణి, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జులు విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలిసి కొత్త నాటకానికి తెర తీసిందన్నారు. తెలుగుదేశాన్ని ఎదుర్కొనే దమ్ము, సత్తాలేకే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కుమ్మక్కై వికృత క్రీడ ప్రారంభించాయని ఆరోపించారు.
 
 
 

మరిన్ని వార్తలు