కులాలవారీగా ‘ఎంబీసీ’ సమీక్ష

2 Jul, 2017 01:53 IST|Sakshi
- సమగ్ర ప్రణాళిక కోసం ప్రత్యేక కార్యచరణ
మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిస్తాం: చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంబీసీ కార్పొరేషన్‌ (అత్యంత వెనుకబడిన తరగతుల సహకార సంస్థ) వార్షిక కార్యాచరణ రూపకల్పనకు ఉపక్రమించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించింది. నిధుల వినియోగంపై ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించేందుకు ఎంబీసీ కార్పొరేషన్‌ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రోజుకో కులానికి సంబంధించిన ప్రతినిధులు, సభ్యులతో సమావేశం నిర్వహిస్తోంది. ఆయా కులాల అవసరాలు, డిమాండ్లను తెలుసుకొని పరిష్కారాల కోసం పథకాలు రూపొందించాలని ఎంబీసీ కార్పొరేషన్‌ భావిస్తోంది.

స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనే లక్ష్యంగా ఆర్థిక సహకార పథకాలపైనే దృష్టి సారించింది. శనివారం శాలివాహన సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించింది. హరితహారం పథకంలో భాగంగా పూలకుండీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆ కులస్తులు డిమాండ్‌ చేశారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ఆ కుల వృత్తిని ప్రోత్సహించినట్లవుతుందని భావించిన అధికారులు ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. 
 
ఉత్పత్తిని పెంచే పథకాలే చేపడతాం: తాడూరి 
కులవృత్తులను ప్రోత్సహించే ప్రక్రియలో భాగంగా ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త పథకాలను ప్రవేశపెడుతోందని ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌ అన్నారు. రజకులు, నాయీ బ్రాహ్మణుల ఉపాధి పథకాల కోసం రూ.500 కోట్లు కేటాయించిందని, ఇదే పద్ధతిలో ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా ప్రణాళికలు తయారు చేస్తున్నామని, ఉత్పత్తిని పెంచే కులాలకు రాయితీ పద్ధథిలో రుణాలు ఇస్తామని చెప్పారు. ‘కులవృత్తులపై ఆధారపడిన వారికి పనిముట్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రస్తుతం కులాల వారీగా సమీక్షలు మొదలుపెట్టాం. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం’అని చెప్పారు. 
మరిన్ని వార్తలు