గ్రూప్-2కు ఆధార్ లింకు

27 Feb, 2016 03:58 IST|Sakshi
గ్రూప్-2కు ఆధార్ లింకు

♦ మాల్‌ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయం
♦ అభ్యర్థులంతా ఆధార్ నంబర్ ఇవ్వాల్సిందే
♦ ఓటీఆర్ వివరాల్లో సవరణలకు మార్చి 1 నుంచి 15 వరకు అవకాశం
♦ పరీక్ష రాసేవారి ఎడమచేతి వేలిముద్రల స్వీకరణ
♦ పరీక్షా కేంద్రాల్లో జామర్ల ఏర్పాటుకు యోచన
♦ కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ వెల్లడి
♦ ఏప్రిల్ 24, 25 తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
 
 సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ను నియంత్రించేందుకు అభ్యర్థులందరి నుంచీ ఆధార్ నంబర్‌ను తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్ణయించింది. ఈ మేరకు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాల్లో ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలని సూచించింది. దీంతోపాటు అభ్యర్థులు ఓటీఆర్‌లోని తమ వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొత్తంగా ఏప్రిల్ 24, 25 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల ఏర్పాట్లపై  చర్యలు వేగవంతం చేసింది. గ్రూప్-2కు దరఖాస్తు చేసుకున్న 5,64,431 మంది తమ ఆధార్ నంబర్‌ను ఇవ్వాలని పేర్కొంది. పరీక్ష కేంద్రాల్లో జామర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.

మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఆధార్ నంబర్ తీసుకుంటున్నామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ శుక్రవారం తెలిపారు. చాలా మంది అభ్యర్థులు దరఖాస్తుల సమయంలో తమ ఆధార్ నంబర్‌లను ఇచ్చారని... మిగతా వారి నుంచి కూడా స్వీకరించాలని కమిషన్ నిర్ణయించిందని చెప్పారు. వారంతా మార్చి 1 నుంచి 15లోగా ఓటీఆర్‌లో ఆధార్ నంబర్ నమోదు చేసుకోవాలన్నారు. నంబర్ లేనివారు సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రంలోగానీ, uidai.gov.in/aapkaaadhar.htmlవెబ్‌సైట్‌లో గానీ నమోదు చేసుకోవాలని సూచించారు.

 ఎడమ చేతి వేలిముద్రల స్వీకరణ
 గ్రూప్-2 పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థుల ఎడమ చేతి వేలిముద్రలను (బయోమెట్రిక్) తీసుకోవాలని కమిషన్ నిర్ణయించినట్లు పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. వాటిని అభ్యర్థుల ఓటీఆర్ డాటాబేస్‌తో అనుసంధానం చేస్తామని, తద్వారా అవి భవిష్యత్తులో పరిశీలనలకు ఉపయోగపడతాయని చెప్పారు. అలాగే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడాన్ని దీనిద్వారా నిరోధించవచ్చని పేర్కొన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మొబైల్ ద్వారా మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు కమిషన్ ఈ చర్యలు చేపడుతోందన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని స్పష్టం చేశారు.
 
 ఓటీఆర్‌లో మార్పులకు అవకాశం
 గ్రూప్-2 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా వాటిల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పార్వతి సుబ్రమణ్యన్ వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌లో అభ్యర్థులు తమ జెండర్, జోన్, కులం, బీసీ క్రీమీలేయర్, పుట్టినతేదీ, ఇతర వివరాల్లో మార్పులు చేసుకోవచ్చని.. కొత్తవి చేర్చవచ్చని తెలిపారు. మార్చి 15వ తే ఈ మార్పులు చేసుకోవాలని, వాటిని తుది వివరాలుగా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. మార్చి 15 తరువాత అభ్యర్థుల ఓటీఆర్‌లో ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. తమ దరఖాస్తులను, ఓటీఆర్ వివరాలను మరోసారి పరిశీలించుకుని ఈ అవ కాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు