రవాణా సేవలకూ ‘ఆధార’మే!

23 Aug, 2017 06:59 IST|Sakshi
రవాణా సేవలకూ ‘ఆధార’మే!
ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ నిర్ణయం
- మొబైల్‌ నంబర్‌ వెరిఫికేషన్‌ కూడా.. నేటి నుంచే అమల్లోకి..
వాహనం రిజిస్ట్రేషన్‌ నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ వరకు..
అన్ని రకాల సేవలకూ వర్తింపు
 
సాక్షి, హైదరాబాద్‌: మీ వాహనం రిజిస్ట్రేషన్‌ కావాలా.. యాజమాన్యం మార్పు జరగాలా.. డ్రైవింగ్‌ లైసెన్సు కావాలా.. అయితే ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. తమ పరిధిలోని అన్ని సేవలను ఆధార్‌తో అనుసంధానిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచే ఇది అమల్లోకి వస్తోంది. అంటే ఇక నుంచి ఆధార్‌కార్డు ఉంటేనే రవాణా శాఖ సేవలు పొందే అవకాశం ఉంటుంది.  
 
నేటి నుంచే.. 
ప్రభుత్వపరంగా ప్రతి లావాదేవీకి ఆధార్‌ను తప్పనిసరి చేయాలని కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విభాగాలకు సూచించింది కూడా. ఈ క్రమంలో రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సుల జారీ, యాజమాన్య హక్కు బదలాయింపు, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ తదితర రవాణా సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దాంతో రవాణా సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా అమలు చేయడానికి రవాణా శాఖ వెనకడుగు వేసింది.ఇలా రెండు సార్లు జరిగింది. తాజాగా మళ్లీ రవాణా శాఖ సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని వెంటనే అంటే బుధవారం నుంచే అమల్లోకి తెచ్చింది. 
 
వన్‌టైం పాస్‌వర్డ్‌ కూడా.. 
ప్రతి లావాదేవీకి వన్‌టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) విధానాన్ని కూడా అమలుచేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. రవాణా శాఖ సేవలు పొందేటప్పుడు కొంతమంది తప్పుడు ఫోన్‌ నంబర్లను పొందుపరుస్తున్నారని.. దాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ రఘునాథ్‌ తెలిపారు. ఏదైనా సేవ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. అందులో పేర్కొన్న ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుందని, దానిని నమోదు చేస్తేనే దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. ఆధార్‌ నంబర్‌ను అనుసంధానించాలని, తప్పుడు ఫోన్‌ నంబర్‌ నమోదు కాకుండా ఓటీపీ విధానాన్ని అమలు చేయాలని పోలీసు శాఖ కూడా కోరడంతో రవాణా శాఖ ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

ఇటీవల రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించేవారికి పెనాల్టీ పాయింట్ల విధింపును చేపట్టిన విషయం తెలిసిందే. నిర్ధారిత మొత్తానికి పాయింట్లు చేరుకుంటే.. ఏడాదిపాటు డ్రైవింగ్‌ లైసెన్సును రద్దు చేయా లని నిర్ణయించారు. కానీ దీనికి సంబంధించి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి ని అధిగమించేందుకు పోలీసు శాఖ ఆధార్, ఓటీపీ విధానంపై దృష్టి సారించింది.
మరిన్ని వార్తలు