ఆరోగ్యశ్రీ సేవలు బంద్

3 Oct, 2016 04:45 IST|Sakshi
ఆరోగ్యశ్రీ సేవలు బంద్

- బకాయిలు పేరుకుపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల సమ్మె
- వైద్య, ఆరోగ్య మంత్రితో చర్చలు విఫలం
- పలు దఫాలుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని సర్కారు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఆదివారం వేకువజాము నుంచి సేవలను నిలిపివేసినట్లు ప్రైవేటు ఆస్పత్రులు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందే వేలాది మంది పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలు రూ.430 కోట్ల మేరకు పేరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రైవేటు ఆస్పత్రులు వెల్లడించాయి. శనివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆస్పత్రులు పేర్కొన్నాయి. పైగా లక్ష్మారెడ్డి తమకు హెచ్చరికలు చేసినట్లుగా వ్యవహరించారని కొందరు ఆరోపించారు. మరోవైపు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా సేవల నిలుపుదలపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

 నిధుల విడుదలలో జాప్యం..
 ఆరోగ్యశ్రీ పథకంలో 30 శాతం సర్వీసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతుంటే, 70 శాతం సేవలు ప్రైవేటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. మొత్తం బకాయిలు రూ.430 కోట్లకు చేరాయి. ఆరోగ్యశ్రీ బిల్లులు పేరుకు పోవడంతో ఆస్పత్రుల నిర్వహణ తమకు భారంగా మారిందని, ఉద్యోగులకు కనీసం వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని, బకాయిలను వెంటనే చెల్లించాలని ఆస్పత్రులు కోరుతున్నాయి. బకాయిల విషయంపైనే ఈ ఏడాది రెండు సార్లు ప్రైవేటు హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆయా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసింది. ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా నిధులు విడుదల చేయడమే కానీ బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించలేదు.

 ఎంవోయూను సమీక్షించాలి
 ఉమ్మడి రాష్ట్రంలో కుదుర్చుకున్న ఎంవోయూనే ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాత విధానాలనే అమలు చేస్తున్నారని ఆస్పత్రులు చెబుతున్నాయి. కాబట్టి ఎంఓయూని సమీక్షించాలని కోరుతున్నాయి. ఒక్కో ఆస్పత్రి నెలకు రెండు సార్లు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లో ఉన్న ఆస్పత్రిఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతాలకు వెళ్లి క్యాంపులు నిర్వహించాలంటే కష్టమవుతోందని పేర్కొంటున్నాయి. ఆస్తి పన్ను, విద్యుత్, మంచి నీటి చార్జీలను ప్రభుత్వం పెంచిందని, ఆ మేరకు టారిఫ్‌ను పెంచాలని ఆసుపత్రి యాజమాన్యాలు కోరుతున్నాయి. రోగులు శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయిన వెంటనే బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
 
 నిరుత్సాహపరచాలనేనా?
 ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది. అందులో 70 శాతం వరకు నిధులు ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులకే కేటాయించాల్సి వస్తోంది. కేవలం 30 శాతం నిధులే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. 2016-17లో ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో రూ.464 కోట్లు కేటాయించారు. ఇంత భారీ మొత్తంలో ప్రైవేటు ఆస్పత్రులను పెంచి పోషించడం వృథాగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. అందుకే ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఆస్పత్రుల్లో బదులు ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసే అంశాన్ని సర్కారు సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఎముకల శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీని తొలగించాలని సర్కారు నిర్ణయించింది. అందుకు సంబంధించి అంతర్గత ఉత్తర్వులు కూడా వెళ్లాయి. అయితే నిరసనలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించి వాటిలోనే చేయాలనేది సర్కారు ఆలోచన. కానీ ప్రభుత్వ ఆస్పత్రులకు ఇప్పటికీ సరైన వసతులు లేనేలేవు.

మరిన్ని వార్తలు