ముక్కులో పేపర్లు కుక్కి...

17 Mar, 2016 19:06 IST|Sakshi
ముక్కులో పేపర్లు కుక్కి...

హైదరాబాద్ : పాతబస్తీలో  సంచలనం రేపిన 15 ఏళ్ల అభయ్‌ కిడ్నాప్‌ మిస్టరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను విజయవాడలో అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశౄరు. అరెస్ట్ చేసినవారిని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ అభయ్ను హతమార్చింది బంధువులా, పని మనుషులా, ఇతర వ్యక్తులా అనేది తెలియాల్సి ఉందన్నారు. కిడ్నాపర్లు హత్య చేసిన తర్వాతే అభయ్ తండ్రికి ఫోన్ చేసి ఉంటారని అన్నారు.

షాహీనాయత్‌ గంజ్‌లోని శ్రీకాలనీకి చెందిన అభయ్‌.. బుధవారం మధ్యాహ్నం అల్పాహారం తెచ్చుకునేందుకు బయటకొచ్చాడు. అప్పటికే పక్కా ప్లాన్‌తో ఉన్న దుండగులు అభయ్‌ను కిడ్నాప్‌ చేశారు. అభయ్‌ ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు సాయంత్రం 5గంటల సమయంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు... అభయ్‌ కోసం వెతకడం మొదలుపెట్టారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో  కిడ్నాపర్ల నుంచి అభయ్ తండ్రికి ఫోన్‌ వచ్చింది. త్రరూ. 10 కోట్లు ఇవ్వాలంటూ అభయ్ తండ్రి రాజ్ కుమార్ కు దుండగులు ఫోన్ చేశారు. తండ్రి అందుకు నిరాకరించడంతో అభయ్ ముక్కులో పేపర్లు కుక్కి శ్వాస ఆడకుండా చేసి హత్య చేసినట్టు సమాచారం.

మరోవైపు అభయ్‌ తల్లిదండ్రులతో నిందితుల ఫోన్‌ సంభాషణ ఆడియో టేపులు విడుదలయ్యాయి. కిడ్నాపర్లు అభయ్‌ తండ్రికి ఫోన్‌ చేసి 10 కోట్లు డిమాండ్‌ చేశారు. అయితే రాత్రికి రాత్రే ఐదు కోట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. లేకుంటే అభయ్‌ ప్రాణాలతో దక్కడని బెదిరించాడు. కనీసం 5 కోట్లు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తన దగ్గర లేదని, 20 లక్షల వరకైతే ఇవ్వగలనని అభయ్‌ తండ్రి ప్రాధేయపడ్డాడు.

అయినా కిడ్నాపర్లు కనికరించలేదు.. డబ్బు తీసుకుని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు రావాలని చెప్పి కిడ్నాపర్‌ ఫోన్‌ పెట్టేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కిడ్నాపర్లు అభయ్ను హతమార్చి, మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి సికింద్రాబాద్ ఆల్ఫా కేఫ్‌ వద్ద వదిలి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు....కాటన్‌ బాక్స్‌ను ఓపెన్‌ చేసి చూడడంతో మృతదేహం బయటపడింది. కాగా అభయ్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.

మరిన్ని వార్తలు