ఆబ్కారీ చెక్‌పోస్టుల ఆధునీకరణ

6 May, 2016 01:20 IST|Sakshi

మరింత పకడ్బందీగా తనిఖీలు  సరిహద్దు రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా మద్యం రవాణా
సాక్షి, హైదరాబాద్: నాటుసారా అక్రమ రవాణాను నియంత్రించడంలో భాగంగా చెక్‌పోస్టులను ఆధునికీకరించాలని ఆబ్కా రీ శాఖ నిర్ణయించింది. గోవా, మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు అక్రమంగా సారా తరలివస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ సూచనల మేరకు చెక్‌పోస్టు వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ ఆదేశాలు జారీ చేశారు. ఆధునికీకరణకు అవసరమయ్యే నిధులు, ఇతర మౌలిక వసతుల కోసం సమగ్ర ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు.
 
4 ఇంటిగ్రేటెడ్ సహా 24 చెక్‌పోస్టులు
రాష్ట్రానికి అక్రమంగా ఎన్‌డీపీఎల్ దిగుమతికి ఆస్కారమున్న ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రధాన రహదారుల వద్ద చెక్‌పోస్టులున్నాయి. అయితే చెట్టు నీడ, దాబా, వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులే ఆబ్కారీ సిబ్బందికి ఆవాసాలు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం దిగుమతిని ఈ చెక్‌పోస్టులు అడ్డుకోలేకపోతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ మినహా 8 జిల్లాలను గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించినా, సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియా, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా ప్రవహిస్తోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గుర్తించింది.

రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 24 అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిల్లో నాలుగు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను నిర్మించాలని అకున్ సబర్వాల్ సూచించారు. ఈ మేరకు బుధవారం కమిషనర్ చంద్రవదన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా వారంలోగా సర్కార్‌కు చెక్‌పోస్టుల ఆధునికీకరణ ఫైలును పంపించనున్నారు. నిధులు సమకూర్చేందుకు సర్కార్ ఆసక్తి చూపని పక్షంలో టీఎస్‌బీసీఎల్ నిధుల్లోంచి సుమారు రూ.100 కోట్ల వరకు వెచ్చించాలని నిర్ణయించారు. సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు, కెమెరాలు, కంప్యూటర్లు, గోడౌన్‌లను సమకూర్చే అవకాశముంది.

మరిన్ని వార్తలు