గాల్లో తేలినట్టుందే..

10 Feb, 2018 11:26 IST|Sakshi
మెట్రో లగ్జరీ ఏసీ ఓల్వో బస్సు

ఎయిర్‌పోర్టుకు పరుగులు పెడుతున్న ఏసీ బస్సులు

ఈ మార్గంలో  35 మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులు

65 శాతం పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో

నగరంలోని అన్ని ప్రధాన మార్గాల నుంచి సర్వీసులు

త్వరలో ఎయిర్‌పోర్టుకు  40 బ్యాటరీ బస్సులు

సాక్షి, సిటీబ్యూరో: విమాన ప్రయాణం..అదో అద్భుత అనుభూతి..ఆకాశ మార్గంలో అతివేగంగా హాయిగా గమ్యం చేరుకోవచ్చు. అదీ ఎయిర్‌బస్‌ గొప్పతనం.. మరి అలాంటి వారు రోడ్డు మార్గంలో ప్రయాణించేటపుడు ఎటువంటి సౌకర్యాలు కోరుకుంటారు.. దాదాపు  ఏరోప్లేన్‌లో వెళ్లేటపుడు ఉన్న సౌకర్యాలే ఉండాలనుకుంటారు.. అందుకు టీఎస్‌ ఆర్టీసీ అటువంటి వారి కోసం గాల్లో తేలిపోయే ప్రయాణ అనుభూతిని కల్పిస్తోంది. మెట్రో లగ్జరీ  ఏసీ ఓల్వో బస్సుల్లో శంషాబాద్‌ విమానాశ్రయానికి నగరం నుంచి ప్రయాణికులను చేరవేస్తూ మనసు చూరగొంటూంది. 

పెరిగిన ప్రయాణికులు  
శంషాబాద్‌  అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే జాతీయ, అంతర్జాతీయ విమానాల  సంఖ్య  పెరిగింది. ప్రతి రోజూ  సుమారు 404  ఫ్లైట్‌ సర్వీసులు  నడుస్తున్నాయి. సుమారు  40 వేల మంది  ప్రయాణికులు  ఎయిర్‌పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు.  విమానసర్వీసుల  సంఖ్య, ప్రయాణికుల  రద్దీ పెరడంతో   ఆర్టీసీ  మెట్రో  బస్సులకు  సైతం ఆదరణ లభిస్తోంది. మరోవైపు   గత సంవత్సరం వరకు ఎయిర్‌పోర్టు మార్గంలో నడిచిన పుష్పక్‌  బస్సుల స్థానంలో  మొదట 29 మెట్రో  లగ్జరీ  ఏసీ బస్సులను  ప్రవేశపెట్టారు. క్యాబ్‌లు, ట్రావెల్స్‌ వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ అతి తక్కువ చార్జీలతో ఏసీ  ప్రయాణం చేసే సదుపాయం లభించడం తో  ప్రయాణికులు  ఆర్టీసీ బస్సులకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో  ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా మెట్రో లగ్జరీ బస్సుల సంఖ్యను  తాజాగా  29 నుంచి  35 కు పెంచారు. దీంతో  ప్రయాణికుల ఆదరణ అనూహ్యంగా పెరిగినట్లు  ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పురుషోత్తమ్‌  తెలిపారు. ఒకప్పుడు  35 నుంచి 40 శాతం వరకే ఉన్న ఆక్యుపెన్సీ రేషియో సైతం  ప్రస్తుతం సుమారు  65  శాతానికి చేరింది. దీంతో  ఎయిర్‌పోర్టు మార్గంలో మరిన్ని అధునాతన బస్సులను ప్రవేశపెట్టేందుకు  గ్రేటర్‌  ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది.

నగరం నలువైపుల నుంచి సర్వీసులు....
నగరంలోని  అన్ని ప్రధాన కారిడార్ల నుంచి ప్రయాణికులు  ఎయిర్‌పోర్టుకు వెళ్లేవిధంగా ఈ బస్సులను ప్రవేశపెట్టారు. జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ మార్గంలో, సికింద్రాబాద్‌ నుంచి బేగంపేట్, పంజగుట్ట,మాసాబ్‌ట్యాంక్, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలో జూబ్లీబస్‌స్టేషన్‌ నుంచి తార్నాక, ఉప్పల్, బండ్లగూడ మార్గంలో, సంగీత్‌ చౌరస్తా నుంచి  తార్నాక మీదుగా  మొత్తం  35 బస్సులు ప్రతి రోజూ 218 ట్రిప్పులు  తిరుగుతున్నాయి. అన్ని మార్గాల్లోనూ  సిటీ నుంచి ఎయిర్‌పోర్టు వరకు రూ.263 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. సాధారణంగా  క్యాబ్‌లు, ట్రావెల్స్‌  కార్లు  వంటి సర్వీసుల్లో  జేఎన్‌టీయూ నుంచి  శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వెళ్లేందుకు   రూ.500 పైనే  ఖర్చవుతుంది. మరోవైపు   ఉదయం  4 గంటల నుంచి రాత్రి  11.30 వరకు కూడా  ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు చొప్పున  అందుబాటులో ఉండడం కూడా  ప్రయాణికుల  ఆదరణకు  అవకాశం కల్పించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి  సిటీకి వచ్చే బస్సు ఉదయం 3.30 గంటలకు బయలుదేరుతుంది. 

పెరిగిన ఆదాయం....
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్‌ బస్సులు గతంలో  తీవ్రమైన నష్టాలతో నడిచాయి. ఎలాంటి లాభనష్టాలు లేకుండా ఈ మార్గంలో  బస్సులు తిప్పాలంటే  ఒక కిలోమీటర్‌పైన కనీసం  రూ.45 లు లభించాలి. కానీ  పుష్పక్‌ బస్సులపైన   రూ.33 నుంచి రూ.35 లు మాత్రమే లభించేవి. దీంతో  ఒక కిలోమీటర్‌పైన సగటున  రూ.10 ఆర్ధిక నష్టంతో, ప్రతి రోజు ఒక బస్సుపైన  రూ.5000  నష్టాలతో  పుష్పక్‌ బస్సులు నడిచాయి. ఈ  బస్సులను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆర్టీసీ    ఏటా కోట్లాది రూపాయల నష్టాలను చవిచూసింది. మెట్రోలగ్జరీ  బస్సులను ప్రవేశపెట్టిన తరువాత  ఈ నష్టాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.‘ ఇంకా లాభాల బాటలోకి  ప్రవేశించలేకపోయినప్పటికీ నష్టాలు మాత్రం తగ్గాయి. అది పెద్ద ఊరట’ అని  ఈడీ పురుషోత్తమ్‌  చెప్పారు. 

త్వరలో  40 బ్యాటరీ బస్సులు....
ఎయిర్‌పోర్టు మార్గంలో మెట్రో లగ్జరీ బస్సులకు  ప్రయాణికుల ఆదరణ పెరగడంతో  త్వరలో విద్యుత్‌తో నడిచే  40 బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. పూర్తిగా పర్యావరణహితంగా, ఏసీ సదుపాయంతో  నడిచే ఈ అత్యాధునిక బస్సులను గతంలో ప్రయోగాత్మకంగా నడిపారు. ప్రయాణికుల నుంచి ఆదరణ లభించింది. దీంతో  మరిన్ని బస్సులను అద్దె ప్రాతిపదికన నడిపేందుకు ఆర్టీసీ టెండర్‌లను ఆహ్వానించింది.

మరిన్ని వార్తలు