కొత్త రూపు.. నవ్య పథం!

31 Dec, 2016 02:47 IST|Sakshi
కొత్త రూపు.. నవ్య పథం!

- మూడో ఏడాదీ దూసుకుపోయిన రాష్ట్ర సర్కారు
- హామీ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ
- కోటి ఎకరాల మాగాణానికి అసెంబ్లీలో ప్రజెంటేషన్‌
- మచ్చ తెచ్చిన ఎంసెట్‌ లీకేజీ, భూసేకరణ

పుష్కలంగా వర్షాలు.. కొలువుదీరిన కొత్త జిల్లాలు.. పాలనలో నవ్య పంథా.. ముఖ్యమంత్రి ఇలాఖాలో ‘డబుల్‌’సంతోషం.. మొత్తమ్మీద ఈ ఏడాది తెలంగాణ సర్కారుకు కలిసొచ్చింది! పాలన సంస్కరణల్లో కొత్త ప్రయోగాలను మూడో ఏడాదిలోనూ ప్రభుత్వం అప్రతిహతంగా కొనసాగించింది. పది జిల్లాల తెలంగాణకు 31 జిల్లాలతో కొత్త రూపునిచ్చింది. కొత్త మండలాలు, కొత్త డివిజన్లను ఏర్పాటు చేసింది. ప్రజలకు పరిపాలనను చేరువ చేసే లక్ష్యంతో కొత్త జిల్లాల ఆవిర్భావానికి సర్కారు చేసిన కసరత్తు ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ పరిణామం.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, మహారాష్ట్రతో అంతర్రాష్ట సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందం, ప్రధాని చేతుల మీదుగా మిషన్‌ భగీరథ పథకం ప్రారంభం, హరితహారం.. ఈ ఏడాదిలో సర్కారు దృష్టి సారించిన కార్యక్రమాలు. ఎంసెట్‌ లీకేజీ, గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ హత్యానంతర పరిణామాలు, ముందుకుసాగని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, నత్తనడక దళితులకు మూడెకరాల భూపంపిణీ, విడతల వారీగా రైతుల రుణమాఫీ, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ బకాయిలు, రైతులకు పంపిణీ కాని ఇన్‌పుట్‌ సబ్సిడీæ ఈ ఏడాదిలో సర్కారుకు మచ్చగా మిగిలిపోయాయి.   
     
   – సాక్షి, హైదరాబాద్‌

ప్రధాని తొలి రాక
ఈ ఏడాది ఆగస్టు 7న నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో తొలిసారిగా రాష్ట్రంలో అడుగుపెట్టారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. దీనితోపాటు మనోహరాబాద్‌– కొత్తపల్లి రైల్వే లైనుకు శంకుస్థాపన, రామగుండంలో ఎన్‌టీపీసీ విద్యుత్‌ ప్లాంటు, ఎఫ్‌సీఐ పునరుద్ధరణ పనులకు పునాదిరాయి వేశారు. అక్కడ్నుంచి కేంద్రంతో రాష్ట్ర సంబంధాలు మరింత బలపడ్డాయి.

హామీలు.. అమలు
ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు ఈ ఏడాదిలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, జూన్‌ 2న అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామకాలు ఇచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టింది. ఇప్పటివరకు వివిద శాఖల్లో దాదాపు  వెయ్యి మంది ఉద్యోగాలు క్రమబద్ధీకరించింది. ముస్లిం రిజర్వేషన్లపై సుధీర్‌ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కొత్తగా రాష్ట్రంలో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసింది.

మొక్కల పండుగ..
హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. జూలైæ 8న ఒకే రోజున హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా 163 కి.మీ. మేర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్లోనూ ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటారు.

బిజినెస్‌ ర్యాంకుల్లో నంబర్‌ వన్‌
టీఎస్‌ఐపాస్‌ పారిశ్రామిక విధానం సత్ఫలితాలను ఇచ్చింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఆమెరికా బయట మొదటి ఆపిల్‌ కార్యాలయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

కొత్త జిల్లాలే హైలెట్‌
అపోహాలు.. అనుమానాలన్నీ కొట్టిపారేస్తూ ప్రభుత్వం అక్టోబర్‌ 10 అర్ధరాత్రి దాటిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. 17 జిల్లాలతో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాలు, వివిధ రకాల ఒత్తిళ్లతో మొత్తం 31 జిల్లాలను ఏర్పాటు చేసింది. 125 కొత్త మండలాలు, 25 కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు స్వయంగా సీఎం కేసీఆర్‌ కసరత్తు చేసి కొత్త జిల్లాల రూట్‌మ్యాప్‌ను పక్కాగా అమలు చేశారు. ముందుగా ప్రకటించిన ముహూర్తం ప్రకారం అక్టోబర్‌ 11న దసరా రోజున కొత్త జిల్లాల్లో ప్రభుత్వం ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. ఈ కసరత్తులో భాగంగా గతంలో ఉన్న జోనల్‌ వ్యవస్థ రద్దుకు నిర్ణయం తీసుకుంది. తొలి రెండేళ్లు విధాన నిర్ణయాల రూపకల్పన, ప్రాజెక్టుల రీ డిజైనింగ్, నిధుల సమీకరణపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది పథకాల అమలు, ఆచరణకు పెద్దపీట వేసింది. ఆదాయం పెరుగుతుందనే ఆశతో 1.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణ వేగం పెంచేందుకు బడ్జెట్లో ప్రతి నెలా రెండు వేల కోట్లు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కేటాయిస్తూ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు.

ఊరిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్లు
డబుల్‌ బెడ్‌ రూం పథకం ఇంకా పట్టాలెక్కలేదు. సీఎం సొంత నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నరసన్న పేటలో మోడల్‌ గృహల నిర్మాణం తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఈ నిర్మాణాలు చేపట్టలేదు. దళిత కుటుంబాలకు  మూడెకరాల భూమి పథకం నత్తనడకన సాగుతోంది. రైతు రుణమాఫీ మరో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. దాదాపు రూ.4 వేల కోట్ల మేరకు పేరుకపోయిన ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ బకాయిలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి.

మచ్చ తెచ్చిన ఎంసెట్‌ లీకేజీ
ఎంసెట్‌ లీకేజీ వ్యవహారం ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది. పేపర్‌ లీకేజీ గుట్టు రట్టు చేసినప్పటికీ బాధ్యులపై కఠినంగా వ్యవహరించకపోవటం అనుమానాలకు తావిచ్చింది. మరోసారి పరీక్ష నిర్వహించి విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటమాడింది.

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కేసు
నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ ఈ ఏడాది సంచలనంగా నిలిచింది. నయీంతో సంబంధాలున్న రాజకీయ నేతలు, పోలీసు అధికారుల పేర్లు బయటకు పొక్కటంతో కేసు ఉత్కంఠ రేపింది. ప్రత్యేకంగా సిట్‌ వేసినా.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో జాప్యంతో సర్కారు విమర్శలపాలైంది.

అసెంబ్లీలో సాగునీటి విధానం
రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌కు ప్రాధాన్యమిచ్చారు. ఏడాదిలో ఎక్కువ సమయం సాగునీటి పథకాల సమీక్షలపైనే దృష్టి సారించారు. బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం స్వయంగా అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చి ఆకట్టుకున్నారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే తమ లక్ష్యాన్ని, గతంలో ప్రాజెక్టుల పేరిట జరిగిన అన్యాయం, దగా, దోపిడీలను ఎండగట్టారు. ఇదే ఏడాది గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదుల ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంలో సర్కారు ఒకడుగు ముందుకేసింది. ఈ ఒప్పందం చేసుకునేందుకు సీఎం రెండుసార్లు ముంబై వెళ్లా రు. ఆగస్టు 28న చరిత్రాత్మక మహా ఒప్పం దంపై రెండు రాష్ట్రాల సీఎంలు సంతకాలు చేశారు.

భూసేక‘రణం’
ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూ సేకరణ ప్రభుత్వాన్ని ఇరుకునపడేసింది. మల్లన్నసాగర్, పాలమూరు ఎత్తిపోతల, నిమ్జ్‌ భూముల సేకరణపై నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేసిన 2013 భూసేకరణ చట్టానికి బదులుగా జీవో నెం.123 ప్రకారం భూసేకరణ చేపట్టడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. జీవోను కొట్టి వేసింది. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం 193, 194 జీవోలను తీసుకు రావాల్సి వచ్చింది. తర్వాత కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్ర భూసేకరణ చట్టం అమలుకు ప్రభుత్వం పావులు కదిపింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

ప్రగతి భవన్‌లోకి సీఎం
ఈ ఏడాది కూడా సీఎం సెక్రెటేరియట్‌కు చుట్టపుచూపుగానే వచ్చి వెళ్లారు. ఇక ఈ ఏడాదిలోనే సీఎం కొత్త అధికారిక నివాస భవన నిర్మాణం పూర్తయింది. దానికి ప్రగతి భవన్‌గా పేరు పెట్టారు.

మరిన్ని వార్తలు