నిబంధనల మేరకే ‘లేపాక్షి’ భూములు

5 Apr, 2016 00:07 IST|Sakshi
నిబంధనల మేరకే ‘లేపాక్షి’ భూములు

♦ కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ
♦ అన్ని శాఖలను సంప్రదించిన తరువాతే కేటాయింపులు
♦ అధికారులు బిజినెస్ రూల్స్ ప్రకారమే వ్యవహరించారు
♦ మంత్రివర్గం ఆమోదించింది
♦ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి శాంబాబ్ లబ్ధి పొందలేదు
♦ ప్రాథమిక ఆధారాలను బట్టి ఆయనపై ఎలాంటి కేసు లేదు
♦ విచారణకు అనుమతించలేం
♦ సీబీఐకి కేంద్ర కార్యదర్శి రాజ్‌కిషన్ వత్స ఉత్తర్వులు
 
 సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చేసిన 8,841 ఎకరాల భూ కేటాయింపులన్నీ బిజినెస్ రూల్స్, ఇతర నిబంధనలకు అనుగుణంగానే జరిగాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని తేల్చిచెప్పింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చేసిన భూ కేటాయింపులు నిబంధనలకు విరుద్ధమని, ఇందులో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చేస్తున్న వాదనలో నిజం లేదని తేలిపోయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రాజ్‌కిషన్ వత్స ఇటీవల సీబీఐకి రాతపూర్వక ఉత్తర్వులు పంపారు.  

 అన్ని శాఖలను సంప్రదించాకే...
 ‘‘అన్ని శాఖలను సంప్రదించిన తరువాతే లేపాక్షి సంస్థకు భూములను కేటాయించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో ప్రభుత్వ ప్రయోజనాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ ఒప్పందాన్ని అప్పటి మంత్రివర్గం కూడా ఆమోదించింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ ఎక్కడా వ్యక్తిగత ప్రయోజనాలు పొందలేదు. బిజినెస్ రూల్స్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీ ప్రకారమే వ్యవహరించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చేసిన భూ కేటాయింపుల్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి శాంబాబ్ ఎలాంటి ప్రయోజనాలు పొందడం గానీ, దురుద్దేశాలతో వ్యవహరించడం గానీ చేయలేదు. ఆయన చర్యలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావు. సీబీఐ ఆరోపించినట్లుగా శాంబాబ్‌పై ఎలాంటి కేసు లేదు. అందువల్ల ఆయనను విచారించేందుకు అనుమతినివ్వడం సాధ్యం కాదు’’ అని కేంద్రం స్పష్టం చేసింది.  

 అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు
 వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు చెందిన లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,841 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, ఈ విషయంలో నిబంధనల అతిక్రమణ జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి  శాంబాబ్‌ను నిందితుల జాబితాలో చేర్చింది. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఈ కేసులో విచారించేందుకు అనుమతినివ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కేంద్రానికి పంపింది. ఈ రికార్డులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సలహాను కోరింది.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ కామెంట్లను కోరింది. కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించిన సీవీసీ కేంద్రానికి తన సలహాను ఇచ్చింది. ఈ సలహాతోపాటు ప్రభుత్వ కామెంట్లను, సీబీఐ రికార్డులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలించింది. తమ ముందున్న ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే  శాంబాబ్‌పై ఎలాంటి కేసు లేదని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో శాంబాబ్ చర్యలేవీ దురుద్దేశపూర్వకమైనవి కావని స్పష్టం చేసింది. ఆయన ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చలేదని వెల్లడించింది. కాబట్టి శాంబాబ్ చర్యలను అవినీతి నిరోధక చట్టం కింద నేర దుష్ర్పవర్తనగా పరిగణించడం సాధ్యం కాదని తెలిపింది.
 
 కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏం చెప్పిందంటే...
► ఈ మొత్తం వ్యవహారంలో శాంబాబ్ లంచం తీసుకున్నట్లు ఎక్కడా ఎలాంటి అభియోగాలు లేవు.
► లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో ఒప్పందానికి సంబంధించిన ఫైల్‌ను శాంబాబ్ అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో ప్రాసెస్ చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ను డెవలపర్‌గా తీసుకొచ్చింది ఏపీఐఐసీ.
► బిజినెస్ రూల్స్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీల ప్రకారమే శాంబాబ్ వ్యవహరించారు. సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా ఫైల్‌ను పంపారు.
► లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో కుదిరిన ఒప్పం దంలో ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు శాంబాబ్ తగిన చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టును ఏర్పాటు చేయకుంటే భూ కేటాయింపులను రద్దు చేసి, భూమిని వెనక్కి తీసుకుంటామనే నిబంధనలను పొందుపరిచారు.
► ఒప్పందానికి ముందు డ్రాఫ్ట్ ఎంఓ యూను  శాంబాబ్ అన్ని శాఖలకు పంపారు. డ్రాఫ్ట్ ఎంఓయూలోని ప్రతీ క్లాజుపై ఆయన సంబంధిత శాఖల అభిప్రాయాలు తీసుకున్నారు.
► ఎంఓయూకు తుదిరూపం ఇచ్చే సమయంలో శాంబాబ్ కొన్ని శాఖల సలహాలను పట్టించుకోలేదని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు.

మరిన్ని వార్తలు