వైద్యానికి నో చెబితే క్రిమినల్ కేసులు

27 Aug, 2015 19:39 IST|Sakshi
వైద్యానికి నో చెబితే క్రిమినల్ కేసులు
  • ప్రైవేటు ఆస్పత్రులతో త్వరలో సమావేశం
  • సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నిబంధనల రూపకల్పన
  • సాక్షి, హైదరాబాద్:  యాసిడ్ దాడికి గురైన బాధితులు ఎవరైనా వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళితే తిరస్కరించకూడదని, అలా ఎవరైనా వైద్యానికి నిరాకరించినట్టు ఫిర్యాదులొస్తే అలాంటి ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2006లో యాసిడ్ దాడికి గురైన బాలిక కేసులో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈనేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి బాధితుల వైద్యానికి ఎవరూ నో చెప్పకూడదని ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులననుసరించి గురువారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.పూనం మాలకొండయ్య జీవో జారీచేశారు.


    ఇందులో పేర్కొన్న అంశాలివే..

    • హాస్పిటల్ కానీ, నర్సింగ్ హోం కానీ యాసిడ్ బాధితులు వైద్యానికొస్తే నిరాకరించకూడదు.
    • బాధితులు ఆస్పత్రికి రాగానే చేర్చుకుని ప్రాథమిక వైద్యం అందించాలి. ఆ తర్వాత అక్కడ వైద్యం లేకపోతే స్పెషాలిటీ వైద్యం ఉన్న చోటుకు పంపించాలి.
    • వైద్యంతో పాటు బాధితులకు మందులు, ఆహారం, పడక వసతి, తిరిగి చర్మం పునరుద్ధరణకు అయ్యే శస్త్రచికిత్స (రీ కన్‌స్ట్రక్టివ్ సర్జరీ) చేయాలి.
    • ఎక్కడైతే బాధితుడు యాసిడ్ దాడికి గురై ఏ ఆస్పత్రికి వైద్యానికి వస్తారో ఆ ఆస్పత్రే బాధితుడికి యాసిడ్ దాడి జిరిగినట్టు ధృవపత్రం ఇవ్వాలి.
    • ఆ సర్టిఫికెట్ తీసుకుని ఏ ఆస్పత్రికెళ్లినా ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించాలి
    • బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందినా ప్రభుత్వ, లేదా ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది
    • వైద్యానికి తిరస్కరించిన ఆస్పత్రులు లేదా క్లినిక్‌లపై సెక్షన్ 375సి కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు
    • రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) సమావేశం నిర్వహించి చట్టం అమలుకు కృషి చేయాలి
    • యాసిడ్ అమ్మకాలకు సంబంధించి నిబంధనలకు లోబడి లెసైన్స్ కలిగి ఉండాలి
    • అమ్మకం అంటే ఒక లెసైన్స్ కలిగిన డీలర్ మరో కొనుగోలు లెసైన్సు ఉన్న వారికి మాత్రమే అమ్మకం చేయాలి. వీటిలో ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్, ప్రభుత్వ విభాగాలు, గుర్తింపు పొందిన మెడికల్ ప్రాక్టీషనర్‌లకు మాత్రమే.
    • ప్రతి లెసైన్సు దారుడు రెన్యువల్ సమయంలో 100 రూపాయల కోర్టు స్టాంప్ ద్వారా ఫారం బిని పొందాలి
    • అమ్మకం దారుడు లెసైన్సును విధిగా డిస్‌ప్లే చేయాలి
    • ఒక్కసారి లెసైన్సు జారీ చేస్తే ఐదేళ్ల వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది
    • లెసైన్సు జారీ చేశాక నిబంధనలు అతిక్రమిస్తే ఏ క్షణంలోనైనా లెసైన్సు రద్దు చేయచ్చు
    • లెసైన్సు పొందిన వ్యక్తి మృతి చెందితే లెసైన్సు రద్దు
    • యాసిడ్ లేదా పాయిజన్ అమ్మకాలు చేసేటప్పుడు తెలియని వ్యక్తికి గానీ, కారణంగా లేకుండా గానీ అమ్మకూడదు
    • ప్రతి అమ్మకం దారుడు ఆయా అమ్మకాలపై రిజిస్టర్ నిర్వహించాలి. ఎవరికి అమ్మారన్న వివరాలు విధిగా పొందుపరచాలి
    • నిబంధనలు అతిక్రమించిన వారిపై 1919 పాయిజన్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం జరిమానా విధిస్తారు
    • ఈ చట్టం పరిధిలోకి ఎసిటిక్ యాసిడ్, ఎసిటిక్ హైడ్రేడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, పాస్ఫరిక్ యాసిడ్, హైడ్రొకైనిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్, హైడ్రొజన్ పెరాక్సైడ్, ఫినాయిల్, పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం హైపొక్లోరైట్ వస్తాయి
మరిన్ని వార్తలు