నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు

17 Jan, 2014 02:08 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : నగరంలో నైట్ షెల్టర్ల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించేందుకు వెంటనే వంద బృందాలను నియమించాల్సిందిగా జీహెచ్‌ంఎసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ (సోమవారం) రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ బృందాలు రంగంలోకి దిగి, నిలువనీడలేక రోడ్లపైన, పార్కుల్లోనూ నిద్రిస్తున్న వారు ఏయే ప్రాంతాల్లో ఎక్కువమంది ఉన్నారో సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.

సోమవారం యూసీడీ విభాగ కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీలైనన్ని నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు మూడు ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలుపగా.. ఎక్కువమంది ఉన్న ప్రాంతాల్లో నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు తగిన స్థలాల్ని, అందుబాటులో ఉన్న భవనాల్ని గుర్తించాల్సిందిగా సూచించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వెంటనే నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

 భవనాలు అందుబాటులో ఉంటే వాటిలోనూ, బహిరంగ ప్రదేశాలుంటే అక్కడా కొత్తగా నిర్మిస్తామన్నారు. ప్రస్తుతానికి బేగంపేట ఫ్లై ఓవర్ దిగువన రెండు నైట్ షెల్టర్లు, బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద తాత్కాలిక నైట్‌షెల్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత నవంబర్‌లో నిలువనీడలేక చలికి గిజగిజలాడుతున్న వారి గురించి ‘సాక్షి’ లో వెలువడిన కథనంతో వెంటనే స్పందించిన  కమిషనర్.. త్వరలోనే వీలైనన్ని నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. తాత్కాలిక షెల్టర్ ఏర్పాటుకు క్యాన్సర్ ఆస్పత్రి వారితో మాట్లాడారు.

 యువతకు ఉపాధి..
 నిరుద్యోగ యువతకు ఆయా అంశాల్లో శిక్షణ ఇప్పించి వారి ఉపాధికి ఉపకరించే  కార్యక్రమాలు చేపట్టేందుకు జోన్‌కొక ప్రత్యేక విభాగం(జీవనోపాధి) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జోనల్ కమిషనర్లకు సూచించారు. వాటి ద్వారా సర్కిల్‌కు వెయ్యిమందికి శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఇందుకు తగు స్థలాల్ని గుర్తించాలన్నారు.

 ఏయే అంశాల్లో శిక్షణనిచ్చేది ఈ నెల 18లోగా ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా సూచించారు. సమావేశంలో స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్ (యూసీడీ) జయరాజ్ కెన్నెడి, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు