కలల విహారి

20 Mar, 2016 03:39 IST|Sakshi
కలల విహారి

నటుడు  క్రీడాకారుడు  సమాజ సేవకుడు  రాహుల్ వెరీవెరీ స్పెషల్

 ‘ఓ 15 ఏళ్ల తర్వాత నన్ను ఎవరూ ఫలానా విధంగా గుర్తుంచుకోవాలని  కోరుకోను. బతికినంత కాలం మన కలల కోసం బతకాలి. అంతే కానీ... చచ్చిన తర్వాత మనని ఎవరో... ఎందుకో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది?  ఈ నిమిషం చనిపోయినా నాకు ఆనందమే. నన్ను గే అన్నారు... యాంటీ హ్యూమన్ అన్నారు. అన్నీ కాంప్లిమెంట్‌గా తీసుకున్నాను. నా పని నేను చేస్తూ  వెళుతున్నా. ఏది చేసినా గెలిచామా? ఓడుతున్నామా? అనే లెక్కల కన్నా మన కలల కోసం చేసే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుండాలి. అదే నేను చేస్తున్నా’ అంటున్నారు బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్. నటుడిగా... రగ్బీ  క్రీడాకారుడిగా... అంతకుమించి సమాజ సేవకుడిగా గుర్తింపు పొందిన
 ఈ స్పెషల్ గెస్ట్‌తో చిట్‌చాట్.           -సాక్షి, సిటీబ్యూరో
 
సిటిబ్యూరో: చిన్నప్పుడు నాన్నమ్మ చిన్న గదిలో ఉండేది. రాత్రికి అక్కడికి దాదాపు 12 మంది వచ్చి పడుకునే వాళ్లు. మనసు పెద్దదైతేఇల్లూ పెద్దదే అవుతుంది అనే నమ్మకంతో పెరిగా. ఇప్పటికీ నాది రెండు గదుల ఇల్లు. నా కారు కన్నా నా ఇల్లు చిన్నగా ఉందని ఫ్రెండ్స్ అంటుంటారు. ఏ గిఫ్ట్ వచ్చినా 24 గంటలకు మించి నా దగ్గర ఉండదు. ఆర్నెళ్లకోసారి ఇంట్లోవన్నీ తీసి పంచేస్తాను. మా డ్రైవర్ ఇంట్లో చిన్న రాహుల్ బోస్ మ్యూజియమే ఉంది.

చిన్న చూపే... పెద్ద మలుపు
నటుడిగా తొలి నాళ్లలో ఇచ్చే ట్రీట్‌మెంట్ కారణంగా పడ్డ కష్టం... సినిమా విడుదలైన తరువాత వచ్చే గుర్తింపుతో తుడిచిపెట్టుకుపోతుంది. అది నా తొలి సినిమా అనుభవం నేర్పిన పాఠం. ఇక నటుడిగా, డెరైక్టర్‌గా ఏది బెటర్ అంటే... సినిమాలో నటుడిది చాలా చిన్న పాత్ర. డెరైక్టర్ సినిమాకు డిక్టేటర్. డెరైక్టర్ అనేవాడు ఔట్‌కమ్, ముగింపునుముందే ఊహించాలి. అప్పుడే అనుకున్నది చెయ్యగలరు. నటుడిగా, ఆడగాడిగా ఏది ఎక్కువ సంతోషాన్నిస్తుందనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. నటన కంటే దర్శకత్వమే సులువని నా అభిప్రాయం. మన పని మనం చేసుకుంటూ అవతలి వాళ్లని వాళ్ల పని చేసుకోనివ్వాలి. వారిని నమ్మాలి. అన్నీ మనమే నియంత్రించడం మానాలి. నా సినిమా కెరీర్‌లో కొన్ని దిద్దుకోలేని లోపాలు ఉన్న విషయం వాస్తవమే.
 
ఒక్క చాన్స్...
ఇక రగ్బీలో 18వ ప్లేయర్‌గా తనకు మాత్రమే అవకాశం రాకపోవడం కన్నా తనకు అవకాశం వచ్చిన ఒకే ఒకే సందర్భాన్ని ఎలా వినియోగించుకున్నాడో అదే ఆటగాడి లక్షణం. ఒంటరిగా బతకగలం... అన్నీ చేసుకోగలం అనే ఆలోచనను మార్చేసింది రగ్బీ ఆట. ఇక ఒక లీడర్‌గా... ప్లేయర్‌గా... మాములు మనిషిగా... ట్రాఫిక్ నుంచి ఆపీస్ విషయాల దాకా చాలాసార్లు బుర్ర వేడెక్కిపోయి..  మనసు చికాకు పెడుతుంది. అలాంటి సమయాల్లో చికాకును పక్కన పెట్టి... కళ్లలో ప్రశాంతతని అలాగే ఉంచి.. చెయ్యవలసిన పని మీద దృష్టి పెట్టిన వాళ్లే సచిన్ టెండూల్కర్ లాంటి గొప్పవాళ్లు.అది కష్టమే కానీ అసాధ్యం కాదు. ఇక ఇన్ని పనులు చెయ్యడానికి నాకు ప్రేరణ ఏంటి అంటే... నా వరకు నేను ఇవన్నీ ఇష్టంతో, ప్రేమతో చేస్తున్నాను. మనం ఇక్కడే ఉండాలి. మన సమాజం... మనుషులపై ప్రేమ ఉంటే ఇవన్నీ చేస్తాం.
 
తోచింది కాదు... అవసరమైనదే ఇవ్వాలి
తోటి వారికి సాయం అంటే నీకు తోచింది కాదు... వారికి అవసరమైనది అందించ డం. సునామీ సమయంలో అండమాన్ కోసం పని చేస్తున్నప్పుడు నేను తెలుసుకున్న విషయమిది. అలాగే తక్కువ ప్రామిస్ చేయాలి. ఎక్కువ ఇవ్వడం సరైన పని. ఇక సొసైటీకి ఏదైనా చెయ్యాలి అనుకుంటే... ఏడాదిలో కొన్ని గంటలైనా... డబ్బయినా మనం ఇవ్వడం ద్వారా సామాజిక బాధ్యత నెరవేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఈ సిటీలో 4,861 హోటల్స్ ఉన్నాయంటున్నారు కదా. సగటునరోజుకు 200 మంది వీటికి వెళ్తారు అనుకోండి. అంటే 4 వేల హోటల్స్‌కి రోజుకి 8 లక్షల మంది... నెలకు 2 కోట్ల 40 లక్షలు. వీరికి ఒక గ్లాసు మంచి నీళ్లు సప్లై చేస్తే అందులో సగం నీళ్లు తాగి సగం వృధా చేస్తుంటారు. ఇలా నెలకు వృధా చేస్తున్న నీళ్లు 24 లక్షల లీటర్లు. ఇది వృధా చెయ్యకపోతే మనం చాలా పొదుపు చేసినట్టేగా. ఇది కూడా నా దృష్టిలో సామాజిక బాధ్యత నెరవేర్చినట్టే. నా సినిమా సెట్లలో ప్లాస్టిక్ నిషేధం... సెక్సువల్ హరాస్‌మెంట్ సెల్... ఆడవాళ్లకు టాయిలెట్లు లాంటి ఏర్పాట్లు ఉంటాయి.
 
మంచిపనికి నేస్తాలెందరో...

అండమాన్‌లో సునామీ తర్వాత అక్కడ సేవా కార్యక్రమాల కోసం ఫౌండేషన్  స్థాపించా. అండమాన్, కాశ్మీర్, మణిపూర్ ఇలా  వెనుకబడిన ప్రాంతాల్లో కొన్ని నెలల పాటు తిరిగా. స్వస్థలంపై గౌరవం కలిగిన.... తక్కువ ఆదాయం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన... సృజనాత్మకత కలిగిన పిల్లలను ఎంపిక చేస్తాం. దాదాపు రూ.5 కోట్ల ఖర్చుతో తమ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దగలిగే విద్యావంతులుగా వారిని తయారు చేస్తాం. ఒక మంచి పని కోసం అని అడిగితే చాలా మంది సాయం చేస్తారు. సినీ పరిశ్రమలో అలాంటి వారిలో జాన్ అబ్రహాం, నందిత, విద్యాబాలన్, విపుల్‌షా లాంటివారు కొందరు సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు