కావాలనే ఆలస్యం !

11 May, 2016 01:45 IST|Sakshi
కావాలనే ఆలస్యం !

అదనపు నిధులకోసమే ‘మెట్రో’ లేట్!
మాల్స్ నిర్మాణం, రిటైల్ ఆదాయం
ఆశించిన స్థాయిలో రాకపోవడంతో నిరాశ
రైట్‌ఆఫ్‌వే సమస్యలు లేవంటున్న అధికార వర్గాలు

 
 
సాక్షి,సిటీబ్యూరో: నగర మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవం తరచూ వాయిదా పడడానికి నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ధోరణే ప్రధాన కారణమని..ప్రభుత్వం నుంచి అధిక నిధులు, రాయితీలు రాబట్టేందుకే ప్రారంభోత్సవంపై నిర్మాణ సంస్థ మీనమేషాలు లెక్కిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాగోలు-మెట్టుగూడ(8కిమీ), మియాపూర్-ఎస్.ఆర్.నగర్(11కిమీ) మార్గాల్లో ఈ ఏడాది జూన్‌లో ప్రారంభోత్సవానికి సాంకేతికంగా అన్ని పనులు పూర్తయినప్పటికీ.. ప్రారంభోత్సవాన్ని నిర్మాణ సంస్థ ఆలస్యం చేయడం వెనక పలు కారణాలున్నట్లు భావిస్తున్నారు. ఆలస్యానికయ్యే వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు సర్కారు తమకు చెల్లించాలని, ఇతర వాణిజ్య రాయితీలనూ నిర్మాణ సంస్థ కోరుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రారంభోత్సవాన్ని ఆలస్యం చేస్తే సర్కారు దిగొస్తుందని నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. అయితే నిర్మాణ సంస్థ తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరించామని, ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు నిధులు చెల్లించే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. కాగా ఈ రెండు మార్గాల్లో మినీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సైతం ముందుకొచ్చిందని, ప్రయాణికులు తమ వాహనాలను నిలుపుకునేందుకు పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయని, ప్రారంభం ఎప్పుడు చేసినా ప్రయాణీకులకు ఇబ్బందులు ఉండవని తెలి పాయి. ఇప్పటికిప్పుడు ఈ రెండు రూట్లలో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలు (కమర్షియల్ ఆపరేషన్స్) ప్రారంభించినా తొలి నాలుగేళ్లు నిర్మాణ సం స్థకు నిర్వహణ పరమైన నష్టాలు తప్పవని ముందుగానే అంచనా వేసిన నేపథ్యంలో తాజాగా ఆలస్యం చేయడం అర్థరహితమని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేయడం గమనార్హం.


నష్టాల బూచి చూపి...!
అదనపు నిధులతోపాటు..అన్ని స్టేషన్లలో రిటైల్ అవుట్‌లెట్లు (స్టేషన్లలో దుకాణాలు)ఏర్పాటుకాకపోవడం, పంజాగుట్ట, హైటెక్‌సిటీ, ఎర్రమంజిల్, మూసారాంభాగ్ ప్రాంతాల్లో మెట్రో మాల్స్ నిర్మాణం పూర్తికాకపోవడం, వాణిజ్య ప్రకటనల ఏర్పాటు, స్టేషన్లలో రిటైల్ దుకాణాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో.. ఇప్పటికిప్పుడు మెట్రో రాకపోకలు ప్రారంభిస్తే వాణిజ్యపరంగా తమకు గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతోనే నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. రెండు మార్గాల్లోని 15 స్టేషన్లలో వాణిజ్య స్థలాలను పూర్తిస్థాయిలో అద్దెకివ్వలేదని తెలిసింది.

మరోవైపు మాల్స్ నిర్మాణం పూర్తికాకపోవడం, వాణిజ్య ప్రకటనల రూపేణా ఆశించిన స్థాయి లో ఆదాయం సమకూరకపోవడంతో ప్రారంభాన్ని మరికొంత ఆలస్యం చేస్తే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎల్‌అండ్‌టీ వర్గా లు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నాయి. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ ఆలస్యమవడంతోపాటు,నాంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్ ఇస్కాన్, ఖైరతాబాద్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారి మధ్యలో పనులు చేపట్టేం దుకు అవసరమైన రైట్‌ఆఫ్‌వే అందుబాటులో లేకపోవడం, పలు స్టేషన్లకు చేరుకునే మార్గాలను రీడిజైన్‌లు చేయమని ప్రభుత్వం ఆదేశాలివ్వడమేఆలస్యానికి ప్రధాన కారణమని చెబుతోంది. అయితే రైట్‌ఆఫ్‌వే విషయంలో ఎల్‌అండ్‌టీ కోరుతున్న అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరించినట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేయడం గమనార్హం. మూడు చోట్ల మినహా ఎక్కడా సమస్యలు లేవని తెలిపాయి.


 పాతనగరం అలైన్‌మెంట్‌పైనా అదేతీరు..
జేబీఎస్-ఫలక్‌నుమా 5.3 కి.మీ మార్గంలో   అఖిలపక్ష   సమావేశం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు సమావేశం నిర్వహించకపోవడం గమనార్హం. అలైన్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వని నేపథ్యంలో ఈ మార్గంలో పనులు మొదలుకాలేదు.
 
అదనపు నిధులు రాబట్టేందుకేనా..?
 
మెట్రోను  జూలై 2017 నాటికి పూర్తిచేయాల్సి ఉంది. కానీ గడువును 2018 డిసెంబరు నాటికి పొడిగించిన విషయం విదితమే. దీంతో మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత అనుకున్న రూ.14 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్ల వరకు పెరగనున్నట్లు నిర్మాణ సంస్థ అంచనా వేస్తోంది. అయితే పెరిగిన అంచనా వ్యయాన్ని ప్రభుత్వమే తమకు చెల్లించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే మెట్రో ప్రాజెక్టు పనులకు తమ సంస్థ రూ.3 వేల కోట్లు ఖర్చు చేసిందని, రైట్‌ఆఫ్‌వే లభించకపోవడం, పాతనగరం అలైన్‌మెంట్ ఖరారు కాకపోవడంతోనే గడువు పెరిగి తమపై ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవంపై డైలమాలో పడినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు