838 కాలేజీల్లో ప్రవేశాలు సున్నా..!

26 Feb, 2017 07:46 IST|Sakshi
838 కాలేజీల్లో ప్రవేశాలు సున్నా..!

ఫలితంగా గుర్తింపును రెన్యువల్‌ చేసుకోని కాలేజీలు

ఉపకార వేతనాలకు ఈ–పాస్‌ సైట్‌లోనూ రిజిస్ట్రేషన్‌ చేయించని వైనం
పలు కోర్సుల రద్దు కోసం ఇంజనీరింగ్‌ కాలేజీల దరఖాస్తులు
ప్రవేశాలపై నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ జాప్యమే కారణం
కౌన్సెలింగ్‌ల నిర్వహణలో అలసత్వంతోనూ ఈ పరిస్థితి


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నత విద్యా కళాశాలలు విద్యార్థుల్లేక వెలవెలబోతున్నాయి. ప్రవేశాల సంఖ్య తగ్గిపోవడంతో మూతపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 838 కాలేజీల్లో విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందలేదు. కొన్నింటిలో అరకొరగా ప్రవేశాలు జరిగినా.. సదరు యాజమాన్యాలే ఆ విద్యార్థులను సమీప కాలేజీల్లో చేర్పించేశాయి. 2016–17 విద్యా సంవత్సరానికిగాను ఆయా బోర్డుల నుంచి గుర్తింపు రెన్యువల్‌ను కూడా వాయిదా వేసుకున్నాయి. అటు సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించే ఈ–పాస్‌ వెబ్‌సైట్లోనూ అవి రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోవడం గమనార్హం. పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం, కౌన్సెలింగ్‌ నిర్వహణలో అలసత్వం కారణంగా కాలేజీల్లో అడ్మిషన్ల పరిస్థితి గాడి తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

20 శాతం కాలేజీలు బంద్‌!
రాష్ట్రంలో మొత్తంగా 7,005 కాలేజీలు ఉన్నాయి. అందులో 2,750 కాలేజీలు ఇంటర్మీడియెట్, ఒకేషనల్‌ కాలేజీలు కాగా.. మిగతా 4,245 కాలేజీలు డిగ్రీ, వృత్తివిద్యకు సంబంధించినవి. 2016–17లో జూనియర్‌ కాలేజీలన్నింటిలోనూ ప్రవేశాలు సంతృప్తికరంగా జరిగాయి. కానీ డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కాలేజీల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఈ విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి డీఈడీ కోర్సు ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 111 డీఈడీ కాలేజీల్లో ఫస్టియర్‌ విద్యార్థులు లేరు. అదేవిధంగా బీఈడీ కోర్సుకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించలేదు. దీంతో దాదాపు 20 వేల మంది విద్యార్థులు ప్రవేశాలకు అర్హత ఉన్నా కాలేజీల్లో చేరలేని పరిస్థితి. ఫలితంగా 83 కాలేజీల్లో విద్యార్థులు చేరలేదు. అదే విధంగా ఇంజనీరింగ్‌ కోర్సుల్లోనూ విద్యార్థుల చేరిక భారీగా తగ్గింది. దాదాపు 80 కాలేజీలు పలు కోర్సులకు సంబంధించి అనుమతులు రద్దు చేయాలని జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

ఉద్యోగాల భర్తీ నేపథ్యంలోనూ..
ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించడం, దానికి తోడు గ్రూప్స్‌ పరీక్షలు నిర్వహించడంతో చాలా మంది ఉద్యోగ పరీక్షలకు సిద్ధం కావడంపై దృష్టిపెట్టారు. శిక్షణ కోసం కోచింగ్‌ సెంటర్లలో చేరారు. ఈ క్రమంలో ఇతర కోర్సుల వైపు దృష్టి సారించలేదు. అలాగే కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు సైతం చేపట్టడంతో వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలు తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

చాలా కాలేజీల్లో తగ్గిన ప్రవేశాలు
► ఉపాధి మరియు శిక్షణ సంచాలక శాఖ పరిధిలోని 274 కాలేజీల్లో 63 కాలేజీల్లో ప్రవేశాలు నమోదు కాలేదు.
► జేఎన్టీయూ పరిధిలోని 518 ఇంజనీరింగ్, పీజీ కాలేజీలకుగాను 110 కాలేజీల్లో అడ్మిషన్లు జరగలేదు. దాంతో ఆయా కాలేజీలు గుర్తింపును రెన్యువల్‌ చేసుకోలేదు.
► సాంకేతిక విద్యా, శిక్షణ బోర్డు పరిధిలో ఐటీఐ, పాలిటెక్నిక్‌ తదితర కాలేజీలు 282 ఉండగా.. వీటిలో 43 కాలేజీల్లో విద్యార్థుల చేరిక చాలా తక్కువగా నమోదైంది.
► తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 104 కాలేజీలుండగా.. 7 కాలేజీల్లో అడ్మిషన్లు జరగలేదు.
► మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో 29   డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రవేశాలు కాలేదు.
► కాకతీయ వర్సిటీ పరిధిలో 509 డిగ్రీ, పీజీ కాలేజీలకుగాను 62 కాలేజీలు గుర్తింపును రెన్యువల్‌ చేసుకోలేదు.
► ఉస్మానియా వర్సిటీ పరిధిలోని 913 కాలేజీల్లో 183 కాలేజీలు ఈ–పాస్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు.

మరిన్ని వార్తలు