మీడియాపై హైకోర్టుకు ఏజీ ఫిర్యాదు

3 Nov, 2016 04:36 IST|Sakshi
మీడియాపై హైకోర్టుకు ఏజీ ఫిర్యాదు

సచివాలయ భవనాల కూల్చివేతపై
    స్టే ఇచ్చినట్లుగా రాశాయని వెల్లడి
అటువంటి ఉత్తర్వులేవీ ఇవ్వలేదన్న ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత అంశంలో మీడియా తీరుపై అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి బుధవారం హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చినట్లు కొన్ని పత్రికలు (సాక్షి కాదు) ప్రచురించాయని ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. స్టే ఇచ్చినట్లు పతాక శీర్షికల్లో ప్రచురించాయంటూ కొన్ని పత్రికల పేర్లను ప్రస్తావించారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ... తాము ఎటువంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు సచివాలయ భవనాలను కూల్చబోమని మీరు (అడ్వొకేట్‌ జనరల్‌) ఇచ్చిన హామీనే రికార్డ్‌ చేసి, కౌంటర్‌ దాఖలు చేయాలని మాత్రమే ఆదేశించామని తెలిపింది. ఇందులో తాము ఇచ్చిన ఉత్తర్వులేమీ లేవని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను యథాతథంగా ప్రచురిస్తుండటంపై కూడా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్టే ఇచ్చినట్లు వచ్చిన కథనాలకు సంబంధించి రాతపూర్వకంగా పిటిషన్‌ దాఖలు చేస్తే పరిశీలిస్తామని అడ్వొకేట్‌ జనరల్‌కు సూచించింది.

మరిన్ని వార్తలు