రేపట్నుంచే ఏఈఈ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన

10 Jan, 2016 06:55 IST|Sakshi
రేపట్నుంచే ఏఈఈ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గత సెప్టెంబరు 20న నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఏఈఈ) పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 11 నుంచి 16 వరకు ధ్రువపత్రాల పరిశీలన  చేయనున్నట్లు కమిషన్ కార్యదర్శి పార్వతీ సుబ్రమణ్యన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 11న ఉదయం 8.30 గంటల నుంచి జేఎన్టీయూహెచ్ (కూకట్‌పల్లి) క్యాంపస్‌లో రోజూవారీ షెడ్యూలు ప్రకారం వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు.

పరీక్ష ఫలితాలను గత డిసెంబర్ 31న వెల్లడించామని, ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో ఉంచినట్లు తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తమవెంట వయసు, విద్యార్హతలు, కుల ధ్రువీకరణ పత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, బీసీలైతే తాజాగా తీసుకున్న క్రీమీలేయర్ సర్టిఫికెట్ తదితరాలను ఒరిజినల్‌తోపాటు అటెస్టేషన్ చేసిన రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని, లేనిపక్షంలో సదరు అభ్యర్థులను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు