మెడికల్ కోర్సులకు మళ్లీ ఎంసెట్!

21 May, 2016 04:32 IST|Sakshi
మెడికల్ కోర్సులకు మళ్లీ ఎంసెట్!

- ‘నీట్’ వాయిదాతో సర్కారు నిర్ణయం... ఎంబీబీఎస్, బీడీఎస్‌ల కోసం నోటిఫికేషన్‌కు కసరత్తు
- నేడో రేపో పరీక్ష తేదీల ప్రకటన... జూలై తొలి వారంలో పరీక్షకు సన్నాహాలు
- ఆగస్టు ఒకటో తేదీ నుంచి వైద్య తరగతులు ప్రారంభం
- ఆయుష్, వ్యవసాయ, పశువైద్య కోర్సుల భర్తీకి పాత ఎంసెటే ప్రాతిపదిక


సాక్షి, హైదరాబాద్: ‘నీట్’ వాయిదాతో రాష్ట్రంలో మెడికల్ సీట్ల భర్తీకి తిరిగి ఎంసెట్ పరీక్షను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్ష తేదీని ప్రకటించనుంది. జూలై తొలివారంలో పరీక్ష నిర్వహించి, ఆగస్టు ఒకటో తేదీ నుంచి వైద్య విద్య తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది. ఈ కొత్త ఎంసెట్‌ను కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ఆయుష్, వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విద్య సీట్లకు ఇప్పటికే నిర్వహించిన ఎంసెట్ ర్యాంకులనే ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ రెండు ఎంసెట్‌లకు కౌన్సెలింగ్‌లు కూడా వేర్వేరుగానే నిర్వహిస్తారని... దీనిపై విద్యార్థులు గందరగోళానికి గురికావద్దని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల భర్తీకి యాజమాన్యాలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశంపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు.

 ఆర్డినెన్స్ కాపీ అందాక..
నీట్ వాయిదా పడిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులతో లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. జూలై తొలివారంలో పరీక్ష నిర్వహిస్తామని.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆర్డినెన్స్ పూర్తి కాపీ అందాక మిగతా అంశాలపై ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపారు.

 అందుబాటులో 2,750 సీట్లు
రాష్ట్రంలోని మొత్తం 18 మెడికల్ కాలేజీల్లో కలిపి 2,750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో (కొత్తగా వచ్చే మహబూబ్‌నగర్ ప్రభుత్వ కాలేజీ కలుపుకొని) వెయ్యి ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,450 సీట్లు, రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. 10 మైనారిటీయేతర కాలేజీల్లోని 1,450 సీట్లలో 50 శాతం (725) సీట్లను కన్వీనర్ కోటాలో ప్రభుత్వమే నిర్ధారించిన ఫీజు ప్రకారం భర్తీ చేస్తుంది.

ఇక 35 శాతం (507) బీ కేటగిరీ సీట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్య సంఘం నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా కేటాయిస్తారు. మరో 15 శాతం (218) సీట్లను ఎన్నారై కోటా కింద కాలేజీ యాజమాన్యాలు నేరుగా భర్తీ చేసుకుంటాయి. మైనారిటీ కాలేజీల్లోని సీట్లను ఏ ప్రవేశ పరీక్ష లేకుండానే నేరుగా భర్తీ చేస్తారు. ఇక ఒక ప్రభుత్వ దంత వైద్య కాలేజీలో 100 సీట్లు, 11 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,040 సీట్లున్నాయి. వీటినీ ఎంబీబీఎస్ తరహాలోనే భర్తీ చేస్తారు.

 బీ కేటగిరీకి ప్రత్యేక పరీక్షపై అస్పష్టత
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 35 శాతం బీ కేటగిరీ(యాజమాన్య కోటా) సీట్లకు గతేడాది తరహాలోనే ఇప్పుడు కూడా ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారా, లేక ప్రభుత్వం నిర్వహించనున్న ఎంసెట్‌తోనే భర్తీ చేస్తారా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నీట్‌పై కేంద్రం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు... ఈ ఏడాదికి మినహాయింపు కావాలని, ప్రభుత్వం నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారానే అన్ని సీట్లను భర్తీ చేసుకుంటామని మాత్రమే కోరారు. ప్రైవేటు వైద్య సీట్లకు ప్రత్యేక పరీక్ష అంశాన్ని ఎవరూ ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో నీట్ వాయిదా వేస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌లో ఏముందో చూశాకే ఒక నిర్ణయానికి వస్తామని కాళోజీ ఆరోగ్య వర్సిటీ అధికారులు తెలి పారు. అయితే ‘నీట్’ నుంచి మినహాయింపు కోరింది ప్రైవేటు మెడికల్ కాలేజీలే కాబట్టి వారు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుందనే వాదనా వినిపిస్తోంది.

ఆయుష్, వ్యవసాయ కోర్సులకు పాత ఎంసెటే!
ఇటీవల నిర్వహించిన ఎంసెట్ మెడికల్ విభాగం పరీక్ష కోసం 1.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రైవేటు మెడికల్ పరీక్షకు 10 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ‘నీట్’ తప్పనిసరని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం మెడికల్ ఎంసెట్‌ను కేవలం ఆయుష్, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య సీట్లకే పరిమితం చేసింది. ఆ పరీక్ష ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు వర్తించదని కూడా స్పష్టం చేసింది. అయినా మెడికల్ ఎంసెట్‌కు 89,792 (88.02%) మంది హాజరయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ నిర్వహించే మెడికల్ ఎంసెట్‌కు ఆయుష్, వ్యవసాయ, దాని అనుబంధ సీట్లకు ఏమాత్రం సంబంధం ఉండదు, కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసమే దానిని నిర్వహించనున్నారు.

 విద్యార్థులకు ఉపశమనం
రాష్ట్ర సిలబస్, తెలుగు మీడియం చదివే విద్యార్థులు, ఇతరులందరికీ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ ఉపశమనం కలిగించిం ది. ఈసారికి ఎంసెట్ ద్వారానే మెడికల్ సీట్లను భర్తీ చేస్తాం. జేఎన్‌టీయూ ద్వారానే ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తాము.
- కరుణాకర్‌రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ

విద్యార్థులూ సిద్ధం కండి
‘‘నీట్‌ను ఏడాదిపాటు వాయిదా వేయడంతో మళ్లీ నిర్వహించే మెడికల్ ఎంసెట్‌కు విద్యార్థులంతా సిద్ధం కావాలి. పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.’’  - వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి

మరిన్ని వార్తలు