మహిళలే మనోళ్ల టార్గెట్...

25 Jan, 2016 19:27 IST|Sakshi

- 8మంది ముఠా సభ్యుల అరెస్ట్
- గల్ఫ్‌లో ఉద్యోగాలంటూ ఆశ
-నకిలీ, ఫోర్జరీ వీసాలతో పాటు పీవోఈ లేకుండానే దేశం దాటించుడే
-వెస్ట్‌గోదావరి, ఈస్ట్ గోదావరి, బెంగళూరు, ముంబైలలో దందా
-ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేసిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు

హైదరాబాద్

పదో తరగతి కన్నా తక్కువ చదువుకున్న మహిళలకు గల్ప్‌లో అధిక వేతనం వచ్చే ఉద్యోగాలిప్పిస్తామంటూ వందలాది మందిని విమానమెక్కించేసిన ఎనిమిది సభ్యులున్న ముఠాను ఆర్‌జీఐఏ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నకిలీ, ఫోర్జరీ వీసాలతో పాటు ఫేక్ ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్(పీవోఈ) డాక్యుమెంట్లను సృష్టించి గ్రామీణ మహిళలను మోసం చేస్తున్న కేటుగాళ్ల వివరాలు గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.


ప్రధాన నిందితుడు టెటలి సుబ్బిరెడ్డి, యెద్దుల శంకర్, తోట కంటేశ్వర, ముదిదన డేవిడ్ రాజు, జక్కంశెట్టి వెంకటేశ్వర రావు, సయ్యద్ ఇలియాజ్, దెబర దొమర, సబ్జర్ హుస్సేన్ లు ఇలా తప్పుడు పత్రాలతో వందలాది మహిళలను విదేశాలకు పంపించారని పోలీసులు తెలిపారు.

కోట్లల్లో దందా...
ఈ కేసు ప్రధాన సూత్రదారి పశ్చిమ గోదావరి పెంటపాడు గ్రామానికి చెందిన టెటలి సుబ్బిరెడ్డి (60) చదివింది ఎనిమిదే. మొదట్లో తన తండ్రికి చెందిన పాన్ షాప్ చూసుకునే వాడు. తర్వాత 1987లో రియాద్‌లోని అల్మాసద్ కంపెనీకి వెళ్లి పనిచేశాడు. ఇదే క్రమంలో అక్రమంగా భారతీయులు దుబాయ్‌కి వస్తున్న తీరును తెలుసుకున్నాడు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన అతడు గల్ప్ ఏజెంట్లతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. 2013లో భారత్‌కు తిరిగి వచ్చి నకిలీ, ఫోర్జరీ వీసా దందాలు మొదలు పెట్టాడు. బెంగళూరులో సారా ట్రావెల్స్ పాస్‌పోర్టు ఏజెంట్‌గా అందరితో పరిచయం పెంచుకున్నాడు పదో తరగతి కన్నా తక్కువ చదివి ఆర్థిక అవసరాలున్న మహిళలను గుర్తించి వారికి ఉద్యోగం ఆశచూపి నకిలీ, ఫోర్జరీ వీసాలతో ఎయిర్ టికెట్లు సమకూర్చి కువైట్, సౌదీ, ఖతర్, దుబాయ్‌లకు పంపించే వాడు.

మొదట్లో గోదావరి జిల్లాలకే పరిమిత మైన దందా.. త్వరలోనే బెంగళూరు, ముంబైకి కూడా పాకింది. గతంలో నకిలీ పర్యాటక వీసాల కేసులో అరెస్టైన సుబ్బిరెడ్డితో కలిసి తన బిజినెస్ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈస్ట్‌గోదావరికి చెందిన జక్కంశెట్టి వెంకటేశ్వర్‌రావుతో, వెస్ట్ గోదావరి ఇరగవరం మండలం పాడి రెడ్డి పాలెంకు చెందిన డేవిడ్ రాజు, వైఎస్‌ఆర్ కడప జిల్లా పెంగళూరు మండల్, నారాయణ్ నెల్లూరుకు చెందిన పాస్‌పోర్టు ఏజెంట్ తోట కంటేశ్వర్, రాజంపేట వైఎస్‌ఆర్ ట్రావెల్స్ ట్రావెల్ ఏజెంట్ యెదుల శంకర్‌లతో పరిచయం ఏర్పడింది. వీరందరూ అప్పటికీ ఇదే రంగంలో ఉండటంతో ఒకరికొకరు అన్ని విషయాల్లో సహకరించుకునేవారు. కడప జిల్లాలోని చిన్నాచౌక్‌లోని ముత్తుర్సుపల్లికి చెందిన యెద్దుల శంకర్ రాజంపేటలోని రమణయ్య ద్వారా ఫేక్ టూరిస్ట్ వీసాలు రెడీ చేసి కడప, వెస్ట్‌గోదావరిలోని మహిళలను గల్ప్‌కు పంపిస్తున్నాడు. ఫేక్, ఫోర్జ్‌డ్ వీసాలతో పాటు పీవోఈ సర్టిఫికెట్లు రెడీ చేయడంలో మంచి దిట్ట అయిన తోట కంటేశ్వర...ఫొటోషాప్ వినియోగించి నకిలీ పీవోఈ, విజిట్ వీసాలు రెడీ చేసి హైదరాబాద్ నుంచి అభ్యర్థులను దుబాయ్ మీదుగా కువైట్, సౌదీకి పంపించాడు.

కాఫీషాప్ అడ్డా..
ఈస్ట్ గోదావరి అంబాజిపేట మండలం ఇసుకపూడికి చెందిన జక్కంశెట్టి వెంకటేశ్వరరావు శంషాబాద్ విమానాశ్రయంలో కాఫీషాప్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. జెట్ ఎయిర్‌వేస్‌లోని కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌గా పనిచేస్తున్న సయ్యద్ ఇలియాజ్ తరచుగా కాఫీ తాగేందుకు ఇక్కడికొస్తుండటంతో ఇద్దరి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ చొరవతోనే ఇలియాస్‌కు, టికే పాస్‌పోర్టు ఏజెంట్లు వెంకటేశ్వరరావు భాస్కర్ రెడ్డి, డేవిడ్ రాజుల మధ్య దళారీ అవతారమెత్తాడు.

వారు తీసుకొచ్చే మహిళా ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు ఇప్పించేందుకు ఒక్కొక్క ప్రయాణికురాలికి రూ.ఐదు వేల చొప్పున వసూలు చేసేవాడు. అందులో రూ.మూడువేలను ఇలియాస్‌కు ఇచ్చేవాడు. అంతేకాకుండా నకిలీ పీఈవోలు సృష్టించడంలో సిద్ధాహస్తుడైన తోట కంటేశ్వరకు...ఆ డాక్యుమెంట్ల మీద ప్రయాణికులను క్లియర్ చేసేందుకు ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నల్గొండ జిల్లాలోని బీబీనగర్‌కు చెందిన దెబర దొమరను పరిచయం చేశాడు. ఆమె కూడా ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.ఐదు వేల వరకు తీసుకునేది. ఉపాధి కోసం గల్ప్‌దేశాలకు వెళ్లే వ్యక్తుల నుంచి పాస్‌పోర్టుల కోసమని రూ.65 వేలు ఒక్కో వ్యక్తి నుంచి వసూలు చేసేవాడు. బషీర్‌బాగ్‌లోని ఇలాఫ్ ఎంటర్‌ప్రైజెస్ సహకారంతో నకిలీ విజిట్ వీసాలు రెడీ చేశాడని పోలీసులకు తెలిసింది.

రెండు చేతుల డబ్బులే...
అరబ్ దేశాలకు వెళ్లాలనుకున్న నిరక్షరాస్యలను సబ్ ఏజెంట్ లు గుర్తిస్తారు. డాక్యుమెంట్ల కోసం రూ. 60 వేలు తీసుకుంటారు. వీరి జాబితాను గల్ప్ ఏజెంట్లకు పంపుతారు. జాబితా నుంచి కఫిల్ తమ అవసరాల మేరకు ఎంపిక చేసుకుని ఉపాధి, హూస్ మెయిడ్ వీసా ఎంబసీ నుంచి తెప్పిస్తారు. ఇలా వీరు ఒక్కో ఉద్యోగికి లక్ష రూపాయల చొప్పున గల్ప్ ఏజెంట్లకు చెల్లిస్తారు. ఇక్కడ ఉన్న ఏజెంట్ ఫేక్ టూరిస్ట్ వీసా రెండీ చేయటం తో పాటు.. ఆయా దేశాలకు టికెట్లు బుక్ చేస్తారు. పాస్ పోర్టు, ఫేక్ టూరిస్ట్ వీసా, ఉపాధి వీసాలను సబ్ ఏజెంట్ ల ద్వారా మహిళలకు అందిస్తారు. వీరే స్వయంగా మహిళలను విమానాశ్రయానికి తీసుకెళతారు. ఇండియాలో టూరిస్టు వీసాను మాత్రమే చూపించాలని మహిళలతో చెబుతారు. బోర్డింగ్ పాస్ ఇప్పించేందుకు ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చెల్లిస్తారు. ఫేక్ పీవోఈ సర్టిఫికెట్, వీసాలను క్లియర్ చేసేందుక ఇమ్మిగ్రేషన్ అధికారికి రూ.5000 ఇస్తారు. దుబాయ్ లో దిగగానే టూరిస్టు వీసాను చించేసి.. అక్కడి అధికారులకు ఎంప్లాయ్ మెంట్, హౌస్ మెయిడ్ వీసాలను చూపించాల్సిందిగా చెబుతారు.

డబ్బుల కోసం కక్కుర్తి...
చదువు కున్నవారితో పాటు.. నిరక్షరాస్యులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే సంస్కృతి బాగా పెరిగిపోయింది. అయితే ఉన్నత విద్య లేని వారు.. తరచూ ఏజెంట్ల చేతిలో మోసపోతుండటంతో ప్రభుత్వం వీరి భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని.. ప్రొటెక్టర్ ఆఫ్ ఎమ్మిగ్రెంట్స్ (పీఓఈ) తీసుకొచ్చింది. ఈ చట్టం కింద అధికారులు రెండు పాస్ పోర్టులను జారీ చేస్తారు. ఎమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ ( ఈసీఆర్), ఎమ్మిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్(ఈసీఎన్ఆర్) స్టేటస్ ఉంటుంది. ఈసీఆర్‌తో కూడిన పాస్‌పోర్టులకు పీవోఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఎయిర్‌పోర్టులో చూపించాల్సి ఉంటుంది. పీవోఈ సర్టిఫికెట్ రావాలంటే ఉద్యోగం ఇచ్చే వ్యక్తి, కంపెనీ సంబంధిత ఎంబస్సీలో ధరావతు కింద రూ.1,50,000ల డిపాజిట్ తో పాటు.. కనీస వేతనాలు, మెడికల్ సదుపాయం చేస్తామని ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటిని భరించలేని కలీఫాలు అడ్డదారిన గల్ప్ ఏజెంట్ల ద్వారా ఉద్యోగులను రప్పించుకుంటున్నారు. ఇలా అయితే వారికి కనీస వేతనాలు ఇవ్వాల్సిన అవసరముండదు. ఆరోగ్యం బాగా లేకున్నా కూడా పట్టించుకోవల్సిన అవసరముండదు. అందుకే చాలా మంది మహిళలకు ఈ విధానం గురించి తెలియక మోసగాళ్ల చేతులో పడి గల్ప్‌లో ఉద్యోగాల కోసం వెళ్లి నానాకష్టాలు పడుతున్నారు. వేధింపులకు గురైతున్నారు.

ప్రయాణికులపై కూడా కేసులు
ఏమీ తెలియకుండా మహిళలు వెళ్లినా.. ఇకపై ప్రయాణికులపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రయాణీకులను ఉపేక్షించడం వల్ల అక్రమ పాస్ పోర్టులు పొంది ఉగ్రవాదులు కూడా.. సరిహద్దులు దాటి వెళుతున్నారని అధికారులు అంటున్నారు. ఇకపై దళారులను గురించి ఏమీ తెలుసుకోకుండా.. గుడ్డిగా ఏజెంట్ల మాటలు వినే వారిపై ఎమ్మిగ్రేషన్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు