రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం!

30 Mar, 2016 04:24 IST|Sakshi
రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం!

ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో ఉత్తమ్
అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చర్యల్లేవు
రైతులను రుణ విముక్తులను చేసేందుకు దయ కలగడం లేదా?
అప్పుల ఊబిలో రాష్ట్రం.. భావితరాలకు ప్రమాదకరం
56 ఏళ్లలో రూ.75వేల కోట్ల అప్పుచేస్తే..
ఈ మూడేళ్లలోనే రూ.లక్ష కోట్ల రుణాలా?

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కరువు కారణంగా పంటలు తగ్గిపోయాయని, రైతులు నష్టాల్లో చిక్కుకున్నారని పేర్కొన్నారు. ‘రుణమాఫీ’ చేసి రైతులను రుణ విముక్తులను చేసే విషయంలో ప్రభుత్వానికి ఎందుకు దయ కలగడం లేదని నిలదీశారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న 74 శాతం మంది ప్రజల ఆదాయం తగ్గిపోయిందని... కరువు కారణంగా పంటల సాగు లేక దీనావస్థలో చిక్కుకున్నారని చెప్పారు. వరిసాగు 34 శాతం తగ్గిపోయిందని, మొక్కజొన్న 30 శాతం, ఇతర ధాన్యాల సాగు 33 శాతం పడిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.4,670 కోట్లు కేటాయించారని... అందులోనుంచైనా లేదా వేరే ఏ పద్దులోనైనా కోతపెట్టి రుణ మాఫీ చేసి, 35 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేయాలని కోరారు.

 అప్పుల ఊబిలో రాష్ట్రం
రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, ఇది భావితరాలకు ప్రమాదకరమని హెచ్చరించారు. రాష్ట్రం గత 56 ఏళ్లలో రూ.75వేల కోట్ల అప్పు చేస్తే.. ఈ మూడేళ్లలోనే రూ.లక్ష కోట్ల అప్పు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2017 వరకు నేరుగా రూ.57వేల కోట్లు, కార్పొరేషన్ల పేరుతో రూ.45వేల కోట్లు రుణాలు తీసుకోబోతున్నారని చెప్పారు. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన టీఆర్‌ఎస్... అధికారంలోకి వచ్చాక భూములు అమ్మి రూ.10,500 కోట్లు సమకూర్చుకోవాలని చూడడమేమిటని నిలదీశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామంటూనే.. జీవోలను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలపై సమాజంలో అన్నివర్గాల్లో అసంతృప్తి, ఆందోళన నెలకొన్నాయని చెప్పారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రత్యేక నిధిని భారీగా పెట్టుకోవడం అప్రజాస్వామికమని ఆరోపించారు.

కరువు కనిపించడం లేదా?
రాష్ట్రంలోని 443 మండలాల్లో కేవలం 231 మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రకటించారని.. మిగతా మండలాల్లో కరువు లేదా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. కరువు ఉన్న ప్రాంతాలన్నింటినీ కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు. ఇక రెండేళ్లుగా బడ్జెట్‌లో కేటాయింపులకు, ఖర్చులకు మధ్య చాలా తేడా ఉంటోందని ఉత్తమ్ స్పష్టం చేశారు. 2014-15లో లక్ష కోట్ల బడ్జెట్‌లో రూ.62వేల కోట్లే ఖర్చు చేశారని... 2015-16 బడ్జెట్‌లో 1.15 లక్షల కోట్లు కేటాయిస్తే రూ.85 వేల కోట్లే ఖర్చు చేశారని పేర్కొన్నారు. ప్రణాళికా కేటాయింపుల్లో సగమే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత బడ్జెట్ అయినా వాస్తవాలకు దగ్గరగా ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. తాజా బడ్జెట్‌లో కేటాయించిన రూ.67 వేల కోట్ల ప్రణాళికా వ్యయం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు