ల్యాప్‌టాప్‌ల కోసం వ్యవసాయశాఖ కసరత్తు

27 Apr, 2017 01:56 IST|Sakshi
ల్యాప్‌టాప్‌ల కోసం వ్యవసాయశాఖ కసరత్తు

- ఐటీ అధికారులతో పార్థసారథి చర్చలు
- 500 ఏఈవో ఉద్యోగాల భర్తీకి మొదలైన ప్రక్రియ  


సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయాధికారులందరికీ ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయశాఖ తక్షణమే రంగంలోకి దిగింది. వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి బుధవారం ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌తో చర్చించారు. అధిక సామర్థ్యం గల 3,500 ల్యాప్‌టాప్‌లు తమకు అవసరమని, అందుకు సహకరించాలని ఆయన కోరారు. గతంలో ప్రభుత్వం అధిక మొత్తంలో ల్యాప్‌టాప్‌లు తీసుకున్నందున అదే కంపెనీ ద్వారా తెప్పించాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. అయితే 3,500 ల్యాప్‌ట్యాప్‌లను ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చనీ, విడతల వారీగా వాటిని తెప్పించేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు.

త్వరగా ల్యాప్‌టాప్‌లు ఇచ్చి రైతులు, భూముల సమగ్ర సమాచారాన్ని జూన్‌ 10వ తేదీ నాటికి అందజేయాలని, ఆ సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేయాలని సీఎం సూచించినందున ఆగమేఘాల మీద తెప్పించాలని యోచిస్తున్నారు. కార్యాలయ అధికారులకు కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకే ఈ ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. మరోవైపు సీఎం ఆదేశంతో 500 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన ఫైలును వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. ఆ ఫైలును సీఎం ఆమోదానికి పంపిస్తారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు.

మోటార్‌ సైకిళ్ల కోసం బ్యాంకు రుణం
వడ్డీ లేని రుణాలతో ఏఈవోలు అందరికీ మోటార్‌ సైకిళ్లు ఇస్తానని సీఎం ప్రకటించడంతో ఆ కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) ద్వారా ఇప్పించే ఆలోచన ఉన్నట్లు పార్థసారథి చెప్పారు.

మరిన్ని వార్తలు