‘కంట్రోల్’ తప్పిన అవినీతి!

7 Oct, 2014 00:19 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ఎయిడ్స్ నియంత్రణ మండలికి అవినీతి వైరస్ సోకింది. అధికారులు, ఎన్జీఓలు కుమ్మక్కై రూ.కోట్లు కొల్లగొట్టారు. కాలపరిమితి తీరిన హెచ్‌ఐవీ కిట్స్‌ను కొనుగోలు చేసి, అవసరం లేకపోయినా ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. అంతేకాదు..నకిలీ రోగులను సృష్టించి పరీక్షలు చేయకున్నా...చేసినట్లు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 22 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ (ఐసీటీసీ)సెంటర్లకు గడువు సమీపించిన హెచ్‌ఐవీ కిట్స్‌ను సరఫరా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కిట్స్‌తో రోగులకు హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా ఫలితాలు తారుమారవుతుండటంట తో ఆయా సెంటర్లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటేనే బాధితులు జంకుతున్నారు.  

బోధనాస్పత్రుల్లో మరీ ఘోరం
ఉస్మానియా ఆస్పత్రిలో చిన్నాపెద్ద అన్నీ కలిపి ప్రతి రోజు సగటున 200-250 వరకు, గాంధీలో 200పై గా శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోజు సగటున 25-30, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 60-70 ప్రసవాలు జరుగుతున్నాయి. శస్త్రచికిత్సలకు ముందు రోగ నిర్థారణలో భాగంగా రక్త, మూత్ర పరీక్షలతో పాటు హెచ్‌ఐవీ టెస్టు తప్పనిసరి. ఆస్పత్రిలోని హెచ్‌ఐవీ కిట్స్ అన్నీ ఎక్స్‌పైర్ కావడంతో వాటిని రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. నిరుపేద రోగులకు ఇది భారమే అయినా తప్పడం లేదు. ఇందుకోసం ఒక్కో బాధితుడు రూ.150 వెచ్చిస్తున్నారు. ఇక శస్త్రచికిత్సల్లో కీలకమైన సర్జికల్ కిట్స్(సూది, దారం, బ్లేడ్ , దూది, గ్లౌజు)లేక పోవడంతో రోగులే వీటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇలా ఒక్కో కిట్టుకు రూ.500-700 వరకు ఖర్చు అవుతోంది.
 
ఏపీసాక్స్‌కు ఐపీఎం డెరైక్టర్ లేఖ
నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)కి అవసరానికి మించి ఎయిడ్స్ కిట్స్ సరఫరా చేశారు. ఎక్స్‌పైరీ డేట్ సమీపిస్తుండటంతో వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మూడు మాసాల క్రితమే ఐపీఎం డెరైక్టర్ ఎయిడ్స్ నియంత్రణ మండలికి లేఖ రాశారు. అధికారులు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా సుమారు ఐదు లక్షల ఎయిడ్స్ కిట్స్ ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఐపీఎం వద్ద అవసరానికి మించి కిట్స్ ఉండగానే అదనంగా మరో రెండు కోట్ల విలువ చేసే  కిట్స్ కొనుగోలు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు