కేంద్ర నిధుల రాబడిలో భారీ లోటు!

28 Mar, 2018 02:59 IST|Sakshi

ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచి చూపుతోంది: అక్బరుద్దీన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్రం నుంచి వచ్చే ఆదా యాన్ని అమాంతంగా పెంచి చూపారని, వాస్తవానికి వాటిలో సగం నిధులూ రావడం లేదని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆక్షేపించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై ఆయన మాట్లాడారు. 2014–15 నుంచి 2017–18 వరకు కేంద్రం నుంచి రూ.75,535 కోట్లు వస్తా యని అంచనా వేయగా.. రూ.33,125 కోట్లే వచ్చాయని అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు.

జనంపై ఏటేటా పన్నుల భారం పెరుగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలకు కేటాయింపులు పెంచుతూ.. విడుదల చేస్తున్న నిధులు తగ్గిస్తున్నార న్నారు. రాష్ట్రానికి హైదరాబాద్‌ నుంచే 72% నిధులు వస్తున్నాయని, బడ్జెట్‌లో నగరానికి పెద్దపీట వేయాలని కోరారు. పాతబస్తీ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘డబుల్‌’ఇళ్ల హామీతోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎంలు విజయం సాధించాయని.. సత్వరం ఆ ఇళ్లు పూర్తి చేయాలని కోరారు.

మిగులుంటే ఖర్చు చేయడం లేదేం?: కిషన్‌రెడ్డి
బడ్జెట్‌లో రూ.5,525 కోట్లను మిగులుగా చూపారని.. మిగులు ఉంటే ప్రతి నెలా చెల్లింపుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతోందని బీజేపీపక్ష నేత జి.కిషన్‌రెడ్డి నిలదీశారు. ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, పరిశ్రమలకు రాయితీల బకా యిలు వంటివి సకాలంలో ఎందుకు చెల్లించడం లేదన్నారు.

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ హామీని నెరవేర్చడం లేదేమని ప్రశ్నించారు. ప్రభుత్వం నామమాత్రంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తోందని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.  

>
మరిన్ని వార్తలు