మాపై అభాండాలు ఆపండి

25 Jul, 2017 04:11 IST|Sakshi
మాపై అభాండాలు ఆపండి
లేదంటే పరువు నష్టం దావా వేస్తాం: అకున్‌ సబర్వాల్‌
- సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే విచారణ  ఎవరినీ టార్గెట్‌ చేయడం లేదు
ఇప్పటిదాకా 27 మందికి నోటీసులిచ్చాం.. 19 మందిని అరెస్ట్‌ చేశాం 
విద్యార్థులను విచారించం.. తల్లిదండ్రుల ఎదుటే కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం  
 
సాక్షి, హైదరాబాద్‌: తమ విభాగంపై, తమపై ఇష్టా రాజ్యంగా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే తాము డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టంచేశారు. కేవలం సినిమా వాళ్లనే టార్గెట్‌ చేసినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ఇప్పటివ రకు ఈ కేసులో 27 మందికి నోటీసులిచ్చామని, అలాగే కెల్విన్‌తో కలిపి 19 మందిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
 
ఫ్రెండ్లీ వాతావరణంలో విచారిస్తున్నాం..
సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులిచ్చా మని, వారిలో ఇప్పటికి ఐదుగురిని ప్రశ్నించామని అకున్‌ పేర్కొన్నారు. అందరినీ మర్యాదపూర్వకంగా, ఫ్రెండ్లీ వాతావరణంలో విచారిస్తున్నామన్నారు. ‘‘ప్రత్యేకమైన గదిలో విచారణ జరుగుతోంది. ప్రతీ అంశాన్ని వీడియో రికార్డు చేస్తున్నాం. శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌ నేతృత్వంలో రెండు సిట్‌ బృందాలు విచారి స్తున్నాయి. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు స్వతంత్రంగా, రాతపూర్వకంగా ఒప్పుకున్నాకే వారి నుంచి నమూనాలు సేకరిస్తున్నాం. విచారణలో ప్రతీ 8 గంటలకోసారి తమ బృందంలోని వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నాం’’ అని ఆయన వివరించారు.
 
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడలేం
సినీ ప్రముఖుల మాదిరే విద్యార్థులను విచారిస్తారా అని వస్తున్న ప్రశ్నలపై అకున్‌ స్పందించారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడలేమని, అందరికీ పిల్లలున్నారని, తాము అలాంటి పొరపాటు ఎట్టి పరిస్థితుల్లో చేయమని స్పష్టంచేశారు. వారంతా మైనర్లు కావడం వల్ల తల్లిదండ్రుల ఎదుటే కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని, అలాగే డ్రగ్స్‌ నియంత్రణపై పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
 
మాకు అన్ని అధికారాలున్నాయి..
డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ విభాగానికి విచారణ అధికా రం లేదని, దర్యాప్తు అధికారులు సరిగ్గా లేరని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై అకున్‌ తీవ్ర స్థాయి లో స్పందించారు. గతేడాది జూన్‌లో ఎక్సైజ్‌ విభా గానికి ప్రభుత్వం ప్రత్యేకమైన అధికారాలు  కట్టబెట్టిం దని స్పష్టంచేశారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారం ఇలాంటి కేసుల్లో తమ విభాగానికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. సెక్షన్‌ 41, 42, 53 కింద నమోదైన కేసుల్లో లోతుగా దర్యాప్తు చేసే అధికారం ఉందని తేల్చిచెప్పారు. డ్రగ్స్‌ తీసుకున్నా, కొనుగో లు చేసినా, విక్రయించినా, ఇంట్లో పెట్టుకున్నా కేసు లు నమోదు చేసే అధికారం ఉందని వెల్లడించారు.
 
మహిళా అధికారులే విచారిస్తారు..
నిజాయితీ కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌లు, డిటెక్టివ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో.. తదితర విభాగాలతో ప్రతీక్షణం టచ్‌లో ఉంటున్నామని, దర్యాప్తులో సందేహాలుంటే తీర్చుకుంటున్నామని అకున్‌ తెలిపారు. పోలీస్‌ శాఖలో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ల సలహాలు కూడా తీసుకుంటున్నామని వివరించారు. తమ వద్ద ఎక్సైజ్‌లో టాప్‌ మోస్ట్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు న్నారని, సిట్‌ బృందంలో మహిళా అధికారులను కూడా నియమించామని తెలిపారు. విచారణలో ఇన్‌స్పెక్టర్‌ జయలక్ష్మి చురుగ్గా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. డ్రగ్స్‌ కేసులో మహిళలను ప్రశ్నించేందుకు మహిళా అధికారులుంటారని స్పష్టంచేశారు. తనకు వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్‌ వ్యవహారంలో భయపడాల్సిన అవసరం లేదని, అలాంటివి చూసుకోవడానికి తన వద్ద ఉన్న ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు సరిపోతారని నవ్వుతూ బదులిచ్చారు.
 
చట్టానికి లోబడే విచారణ: చంద్రవదన్‌
డ్రగ్స్‌ కేసు విచారణలో తమ సిట్‌ బృందం చట్టానికి లోబడి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ముం దుకు వెళ్తోందని ఎౖక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ చెప్పారు. సిట్‌ విచారణకు మరి కొందరు హాజరుకావాల్సి ఉందన్నారు. ఆగస్టు 2 వరకు వారంతా విచారణకు వస్తారని మీడియాకు వివరించారు. సిట్‌ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోం దని, సమర్థవంతమైన అధికారులున్నారని, ఈ కేసులో ఎవరినీ వదలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఒకరిని టార్గెట్‌గా చేసుకొని వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.

ఇప్పటివరకు 3 వేల యూనిట్ల ఎల్‌ఎస్‌డీ డ్రగ్, 100 యూనిట్ల ఎండీ ఎంఏ, 45 గ్రాముల కొకైన్‌ ఇతరత్రా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సినీ నటి చార్మి హైకోర్టుకు వెళ్లడంపై చంద్రవదన్‌ స్పంది స్తూ... ‘‘మాకు కోర్టు నుంచి ఎలాంటి అధికారిక పత్రాలు అందలేదు. అయినా మా న్యాయ బృందం ఆ అంశాలపై కౌంటర్‌కు రెడీ అవుతోంది. బ్లడ్, ఇతర శాంపిల్స్‌ను ఎవరిని నుంచి బలవం తంగా తీసుకోవడం లేదు. స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకుంటున్నాం’’ అని అన్నారు. చార్మితోపాటు ముమైత్‌ఖాన్‌ సిట్‌ కార్యాల యంలోనే విచారణకు హాజరవుతారని భావిస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం సిట్‌ ఎదుట సినీ ఆర్డ్‌ డైరెక్టర్‌ ధర్మారావు అలియాస్‌ చిన్నా హాజరవుతారని తెలిపారు.
>
మరిన్ని వార్తలు