మానవ మృగం

18 Mar, 2017 03:18 IST|Sakshi
మానవ మృగం

మద్యం మత్తులో కన్నకూతురిపై లైంగికదాడి
భార్యపై అనుమానంతోనే ఘాతుకం
గోడకేసి కొట్టి హతమార్చిన తండ్రి
పోలీసుల అదుపులో నిందితుడు


హైదరాబాద్‌: తప్పతాగి కళ్లుగానక కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడమేగాక, తండ్రి వికృత చేష్టలతో భయపడి పారిపోతున్న చిన్నారిని దారుణంగా చంపేశాడో మానవ మృగం.గత శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ దారుణం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన పత్తివాడ సురేష్‌ (28), జ్యోతి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కీర్తి(2.5) ఏళ్లు అనే కుమార్తె ఉంది. అయితే గత కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న సురేష్‌ ఆమెను తరచూ వేధించేవాడు. కీర్తి తనకు పుట్టలేదనే భావనలో ఉన్న అతను ఆమెను కొట్టేవాడు. అతని వేధింపులు తాళలేక జ్యోతి కొన్నాళ్ళ క్రితం కుమార్తెతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే నెల రోజుల క్రితం అక్కడికి వెళ్లిన సురేష్‌ తాగుడు మానేస్తానని, భార్యాబిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటానని పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకుని వారిని నగరానికి తీసుకువచ్చాడు.

కొద్దిరోజులు దిల్‌సుఖ్‌నగర్‌ లో ఉనక్న వీరు ఇటీవల జూబ్లీహిల్స్‌కు మకాం మార్చారు. స్థానిక రోడ్‌ నెం.23లోని ఓ ప్లాట్‌ వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తూ సమీపంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. తాగుడుకు బానిసైన సురేష్‌ తన వైఖరి మార్చుకోకపోగా, భార్య లేని సమయంలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత శనివారం సాయంత్రం తప్పతాగి వచ్చిన అతను మరోసారి భార్యతో గొడవపడ్డాడు. అదే సమయంలో కీర్తి ఏడవడంతో ఆమెను సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించాడు. తండ్రి చేష్టలతో భయాందోళనకు గురైన చిన్నారి పారిపోవడానికి ప్రయత్నించగా, వెంటాడి పట్టుకున్న అతను బాలికను గోడకేసి బలంగా కొట్టడమేగాక పళ్లతో పాశావికంగా కొరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

కొద్దిసేపటికి కుమార్తెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన జ్యోతి రక్తపుమడుగులో ఉన్న చిన్నారిని చూసి సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గత ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత సురేష్‌ మద్యం మత్తులో కుమార్తెను గోడకేసి కొట్టి చంపేశాడని భావించారు. అయితే అతడిని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు