లారీలన్నీ బంద్‌

31 Mar, 2017 04:33 IST|Sakshi
లారీలన్నీ బంద్‌

గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన సమ్మె

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లారీలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అత్యవసర సరుకులు మినహా మిగతా అన్ని రకాల సరుకుల రవాణా దాదాపుగా ఆగిపోయింది. జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్లతో పాటు రాష్ట్రంలో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ గురువారం ఉదయం ఆరు గంటల నుంచే లారీ యజమానులు సమ్మె ప్రారంభించారు. తెలంగాణ లారీ యజమానుల సంఘంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపినా అవి కొలిక్కి రాలేదు. ఉన్నఫళంగా డిమాండ్ల పరిష్కారం సాధ్యం కాదని చెప్పిన ప్రభుత్వం.. వాటి పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ దీనికి లారీ యజమానుల సంఘం అంగీకరించలేదు. ఫలితంగా చర్చలు విఫలం కావటంతో.. ముందుగా ప్రకటించిన మేరకు గురువారం ఉదయం ఆరు గంటలకు లారీ యజమానులు సమ్మె మొదలుపెట్టారు.

దాదాపు లక్షన్నర లారీలు..
గురువారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర లారీలు ఆగిపోయాయి. చాలా మార్కెట్లకు సరుకు రవాణా నిలిచిపోయింది. హైదరా బాద్‌లోని మూసాపేట్, మియాపూర్, పటాన్‌ చెరు, వనస్థలిపురం, ఆటోనగర్‌ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో వేలాది లారీలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు లారీల రాకపోకలు ఆగిపో యాయి. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు సరఫరా అయ్యే ఇసుక రవాణా కూడా చాలా వరకు నిలిచిపోయింది.

బుధవారం ఉగాది సెలవు రోజు కావటం, ముందే సరుకు రవాణా బుక్‌ చేసుకుని ఉండటంతో కొన్ని లారీలు మాత్రం రోడ్డెక్కాయి. అవి కూడా శుక్రవారం నిలిచిపోతాయని లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరెడ్డి ప్రకటించారు. పాలు, మందులు, కూరగాయలు, చమురు, నీటి ట్యాంకర్లను తాత్కాలికంగా సమ్మె నుంచి మినహాయించామని... ఆదివారం నాటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే వాటిని కూడా సమ్మెలోకి తెస్తామని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలకు వర్తించేలా సింగిల్‌ పర్మిట్‌ను అమలు చేయాలని, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

నేటి నుంచి వంటావార్పు, నిరసనలు..
ప్రస్తుతం దక్షిణ భారతదేశవ్యాప్తంగా లారీల సమ్మె కొనసాగుతోంది. దాంతో కొందరు ముందస్తు రవాణా ఒప్పందాలు కుదుర్చు కున్నా కూడా.. ఇతర లారీల నిర్వాహకులు అడ్డుకునే అవకాశం ఉండటంతో లారీలు నడపడం లేదు. ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంటున్నారు. గురువారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదని.. దీంతో శుక్రవారం నుంచి సమ్మెను తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్టు లారీల యజమానుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు.

శుక్రవారం నుంచి వంటావార్పు కార్యక్రమాలు, నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదివారం వరకు ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. సోమవారం నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం ధాన్యం సరఫరా సీజన్‌ కావటంతో.. లారీల సమ్మె విషయంలో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ఆర్టీఏ ప్రత్యేక సెల్‌
నిత్యావసరాలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు రవాణా శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. మార్కెటింగ్, పౌర సరఫరాల విభాగాలకు అవసరమైన వాహనాలను అందజేసేందుకు, సరుకు రవా ణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ కేంద్రంగా 9848528460 నంబర్‌తో ప్రత్యేక సెల్‌ ఏర్పా టు చేసింది. ప్రస్తుతం అన్ని చోట్లా నిత్యా వసరాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వారం వరకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌ పాండురంగ్‌ నాయక్‌ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు