తమ్మిడిహెట్టి నుంచి పాదయాత్ర

21 May, 2016 04:41 IST|Sakshi
తమ్మిడిహెట్టి నుంచి పాదయాత్ర

ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాలని అఖిలపక్షం నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు పాదయాత్ర నిర్వహించాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో శుక్రవారం తెలంగాణ రైతు సంఘాల జేఏసీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. చాడ వెంకటరెడ్డి(సీపీఐ),తమ్మినేని వీరభద్రం(సీపీఎం), దాసోజు శ్రవణ్‌కుమార్(కాంగ్రెస్), ఇ.పెద్దిరెడ్డి(టీడీపీ), పీఎల్ విశ్వేశ్వర్‌రావు(ఆమ్ ఆద్మీ), మన్నారం నారాయణ(టీ- లోక్‌సత్తా), వేములపల్లి వెంకట్రామయ్య, జేవీ చలపతిరావు(సీపీఐ-ఎంఎల్ న్యూ డెమొక్రసీ), మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, తెలంగాణ రైతు సమితి నాయకులు రామ నర్సయ్య, జలసాధన సమితి కన్వీనర్ మన్నారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. పాదయాత్ర తర్వాత మల్లన్న సాగర్ వద్ద సమావేశం నిర్వహిస్తామన్నారు. నూతన ప్రాజెక్టుల కోసం అవసరానికి మించి భూమి సేకరిస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.2,000కోట్లు కేటాయిస్తే పెండింగ్ ప్రా జెక్టులు పూర్తయి 8లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. ఆదిలాబాద్‌లో రూ.1,000 కోట్లు వెచ్చిస్తే లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు. ప్రాజెక్టు ల వాస్తవికత, రీడిజైనింగ్‌తో, భవిష్యత్తులో ప్రజలపై పడే భారం తదితర విషయాలతో సీఎం, గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు.

మరిన్ని వార్తలు