నిర్మాణ అనుమతులకూ సింగిల్‌ విండో

12 Aug, 2017 03:50 IST|Sakshi
నిర్మాణ అనుమతులకూ సింగిల్‌ విండో

అన్ని శాఖల నుంచి ఒకేసారి అనుమతులు: కేటీఆర్‌
చిన్న బిల్డర్లకు ప్రత్యేక మినహాయింపులు..
అక్రమ నిర్మాణాలు జరిపితే జరిమానాలు తప్పవని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: నిర్మాణ రంగ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతు లను సింగిల్‌ విండో విధానంలో జారీ చేసేలా కొత్త విధానాన్ని తీసుకొస్తామని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. అగ్నిమాపక, మైనింగ్, పోలీసు తదితర శాఖలతో పాటు ఏవియేషన్‌ అథారిటీ నుంచి కూడా ఒకే చోట అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీల్లో అమల్లోకి తెచ్చిన డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ సిస్టం (డీపీఎస్‌)తో అవినీతి గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీడీఎఫ్‌) మూడో వార్షిక సర్వసభ్య సమావేశంలో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌లో భూ రికార్డులను క్రమబద్ధీకరించే అంశంపై సీఎం దృష్టి సారించారని చెప్పారు. ఇక బిల్డర్లు కోరిన 36 రకాల రాయితీలు, మినహాయింపులకు సీఎం కేసీఆర్‌ ఒకే సమావేశంలో ఆమోదం తెలిపారని.. వాటిని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఆరు జీవోలు జారీ చేసిందని తెలిపారు. బిల్డర్లు కోరుతున్న నాలా చార్జీల మినహాయింపులు, ఇతర విజ్ఞప్తులపై త్వరలో ఓ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే విధంగా చిన్న బిల్డర్లకు ఉండే పరిమితుల దృష్ట్యా వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తామన్నారు.

నాణ్యంగా కట్టండి..
సెట్‌బ్యాక్, డ్రైనేజీ, పార్కింగ్‌ సదుపాయాలు లేకుండానే బిల్డర్లు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారని.. ఇప్పటివరకు అరాచకం కొనసాగిందని కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. భండారీ లేఅవుట్‌లో ఒకదాని తర్వాత ఒక కట్టడాన్ని కట్టారని.. మరి అంత దుర్మార్గంగా కట్టాల్సిన అవసరం లేదన్నారు. డబ్బుకు ఆశపడకుండా నాణ్యమైన కట్టడాలు నిర్మించాలని బిల్డర్లకు సూచించారు. గత 30 ఏళ్లుగా నడుస్తున్న అక్రమాలను ఇప్పటికిప్పుడు కూలగొట్టడం సాధ్యం కాదని.. అయితే ఇకపై అక్రమాలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ శివార్లలోని ప్రగతినగర్, పుప్పాలగూడ, నార్సింగ్, బోడుప్పల్, పీర్జాదిగూడ తదితర నగర పంచాయతీలు ఏదో ఒక రోజు జీహెచ్‌ఎంసీలో విలీనమవుతాయని.. ఆ ప్రాంతాల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.

వచ్చే ఆగస్టులోగా లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
నగర శివార్లలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టులోగా హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని, వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈ నెలా ఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. హైదరా బాద్‌కి తాగునీటి సరఫరా కోసం శామీర్‌ పేట్‌లో తలపెట్టిన భారీ రిజర్వాయర్‌ను రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో టీడీఎఫ్‌ అధ్యక్షుడు సి.ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి జక్కా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు