చేప ప్రసాదం పంపిణీకి సర్వం సన్నద్ధం

8 Jun, 2016 06:38 IST|Sakshi
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సన్నద్ధం
 • ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు, టోకెన్లకు కౌంటర్లు
 • వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు
 • ఆరు శాఖల ఆధ్వర్యంలో పక్కాగా ఏర్పాట్లు
   
 •  సాక్షి, హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో(బుధ, గురు వారాల్లో) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఉదయం 8.30 గంటలకు చేప ప్రసాదం పంపిణీకి చర్యలు తీసుకుంది. రెవెన్యూ, మత్స్య, విద్యుత్తు, జలమండలి, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల ఆధ్యర్యంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, ప్రజలకు అసౌకర్యం     కలుగకుండా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున తరలివచ్చే ప్రజల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రైల్వే స్టేషన్, వివిధ కూడళ్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

  ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి 10 వేల చేప పిల్లలతో ప్రత్యేక డ్రమ్ములను మత్స్య శాఖ అందుబాటులో ఉంచింది. చేప ప్రసాదం పంపిణీకి టోకెన్లను అందజేయనున్నారు. టోకెన్‌కు రూ.15 చెల్లించి చేప పిల్లను పొందాలి. మహిళలు, పురుషులు, వికలాంగులు, వృద్ధులు, వీఐపీలకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది  పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. తొక్కిసలాట, అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ కార్మికులు  మూడు షిఫ్టుల్లో పారిశుద్ధ్య కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జలమండలి మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటోంది. 50 వేల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించారు.


   ప్రత్యేక ఏర్పాట్లు..
   చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా తొక్కిసలాట లాంటి ఘటనలు జరగ కుండా ఏడు వరుసల్లో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం రెండు ప్రత్యేక క్యూలైన్లు ఉన్నాయి. విద్యుత్తు శాఖ లైట్లు, మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచింది. వైద్య శాఖ మెడికల్ టీమ్స్, మొబైల్ యూనిట్లు, అంబులెన్స్ మొదలైన ఏర్పాట్లు చేయగా, జీహెచ్‌ఎంసీ తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిం చింది. ప్రజల సౌకర్యార్థం 80 మంది వాలంటీర్లను నియమించారు.
   

మరిన్ని వార్తలు