బీఎడ్‌లో సీట్లన్నీ ఖాళీ

8 Oct, 2016 03:22 IST|Sakshi

- కోర్సుపై రెండేళ్లుగా తగ్గిపోతున్న ఆసక్తి
- సీట్లు పొందినా కాలేజీల్లో చేరని సగం మంది
- 17 నుంచి చివరి దశ కౌన్సెలింగ్!
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుపై ఆసక్తి ఏడాదికేడాది తగ్గిపోతోంది. రెండేళ్లుగా ఈ కోర్సులో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అర్హులు కాకపోవడం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం కావాల్సి రావడం, దీన్ని రెండేళ్ల కోర్సుగా చేయడంతో విద్యార్థులు బీఎడ్ పట్ల విముఖత చూపుతున్నారు. తాజాగా నిర్వహించిన బీఎడ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థుల్లో సగం మంది కూడా కాలేజీల్లో చేరకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2016-17 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం గత నెలలో నిర్వహించిన తొలి దశ కౌన్సెలింగ్‌లో   10 వేల మందికి సీట్లు కేటాయించగా..అందులో సగం మంది కూడా కాలేజీల్లో చేరలేదు. రాష్ట్రంలోని 184 కళాశాలల్లో 15,500 బీఎడ్ సీట్లు అందుబాటులో ఉండగా.. కన్వీనర్ కోటాలో 12,532 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో 21,937 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అందులో 9,887 మందికి సీట్లు కేటాయించగా.. 4,756 మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. చివరి దశ కౌన్సెలింగ్‌లో వందల మంది విద్యార్థులైనా కాలేజీల్లో చేరుతారా, లేదా? అన్న పరిస్థితి నెలకొంది.

 అదనంగా మరిన్ని సీట్లు: తొలి దశ కౌన్సెలింగ్‌లో 184 కాలేజీల్లోని సీట్ల భర్తీకే దిక్కులేదు. మరోవైపు మరిన్ని కళాశాలలకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు మారడంతో మరో 10 కాలేజీలకు గుర్తింపు లభించింది. వీటిలో 1,000 సీట్లు ఉన్నాయి. ఇక జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మరో 12 కాలేజీలకు అనుమతి ఇచ్చింది. వీటిలో ప్రవేశాలకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. వీటికి అనుమతి వస్తే..1,200 సీట్లు అందుబాటులోకి వస్తాయి. తొలిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా, విద్యార్థులు చేరకపోవడంతో మిగిలి పోయినవి 5,131 సీట్లున్నాయి. వీటితోపాటు తొలి దశలో కేటాయించని 2,645 సీట్లు, కొత్తగా వచ్చే సీట్లు కలిపి చివరి దశ కౌన్సెలింగ్‌లో 10 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలోనే సగం సీట్లు భర్తీ కాని నేపథ్యంలో.. చివరి దశలో ఎన్ని భర్తీ అవుతాయోననే సందేహం నెల కొంది. 2015-16లో 60వేల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 44 వేల మందే దరఖాస్తు చేశారు.

 17 నుంచి చివరి దశ కౌన్సెలింగ్!: మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 17 నుంచి చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశముంది. 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు కల్పించి, 22లోగా సీట్ల కేటాయింపు ప్రకటించనున్నట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు