ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ

4 Jul, 2014 02:24 IST|Sakshi
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ

 21 మందితో కొత్త కార్యవర్గం  ఉత్తర్వులు జారీచేసిన సర్కార్

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా సీనియర్ సంపాదకులు అల్లం నారాయణను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌తోపాటు పలు ప్రధాన పత్రికల సంపాదకులను ఇందులో సభ్యులుగా నియమించింది. ఈ మేరకు సమాచార శాఖ కమిషనర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఆర్వీ చంద్రవదన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల్లోగా ప్రెస్ అకాడమీ పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు కేబినెట్ హోదాతోపాటు అన్ని లాంఛనాలు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  
 
ప్రస్తుతం ఏపీ ప్రెస్ అకాడమీ పనిచేస్తున్న చోటే తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ పనిచేయడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఆ అకాడమీ కార్యదర్శిని, సమాచార శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అకాడమీ పాలక మండలి పదవీ కాలం రెండేళ్లపాటు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

 కమిటీ సభ్యులు: టంకశాల అశోక్, వి.మురళి, కె.శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మ య్య, కె.శేఖర్‌రెడ్డి, సీఆర్ గౌరీశంకర్, కె.శ్రీనివాస్‌రెడ్డి, జహీర్ అలీఖాన్, వినయ్‌వీర్, ఎన్.వేణుగోపాల్,ఎం.నారాయణరెడ్డి, కొమరవెల్లి అంజయ్యలతోపాటు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సమాచార శాఖ నామినీ, తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా వర్సిటీ జర్నలిజం విభాగాల అధిపతులు, దూరదర్శన్ స్టేషన్ డెరైక్టర్, సమాచార శాఖ డెరైక్టర్, ప్రెస్ అకాడమీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

మరిన్ని వార్తలు