దర్యాప్తును క్యాష్‌ చేసుకున్నారు!

20 Mar, 2017 03:23 IST|Sakshi
దర్యాప్తును క్యాష్‌ చేసుకున్నారు!

కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కాం దర్యాప్తులో సీఐడీ అధికారులపై ఆరోపణలు
నిందితులు లొంగిపోయేందుకు సహకారం
ప్రభుత్వ ప్రతిష్టాత్మక కేసు నీరుగార్చిన వైనం
ఉన్నతాధికారుల విచారణలో తేటతెల్లం
దర్యాప్తు అధికారితోపాటు మరో ఇద్దరిపై వేటుకు రంగం సిద్ధం


సాక్షి, హైదరాబాద్‌: బోధన్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ కేసు పక్కదారి పట్టింది. వందల కోట్లు దిగమింగిన కేసులో నిందితులకు సీఐడీ అధికారులు సహకరించినట్టు ఆరోపణలు రావడం సంచలనాత్మకంగా మారింది. నిందితు లతో కుమ్మక్కై, వారు అరెస్ట్‌ కాకుండా నేరుగా కోర్టులో లొంగిపోయేలా సహకరించడంతో పాటు స్కాంలో ఆరోపణలెదుర్కొంటున్న ఉన్నతాధికారుల పాత్ర బయటకు రాకుండా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీస్‌ శాఖ ముఖ్యమంత్రికి నివేదిక అందించి నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రధాన నిందితుడితో డీల్‌
బోధన్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కాం దర్యాప్తును కొందరు అధికారులు సొమ్ము చేసుకున్నట్టు సీఐడీ చేసిన అంతర్గత విచారణలో బయటప డింది. నిందితులకు సహకరించడంతోపాటు లొంగిపోయేలా తోడ్పాటు అందించారని దర్యాప్తు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ఉన్నతాధి కారులు కృషి చేస్తుంటే దర్యాప్తు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది నిందితులతో ఒప్పం దం కుదుర్చుకున్నట్టు విచారణలో బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు శివరాజ్‌తో ఈ డీల్‌ కుదుర్చుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. అలాగే కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ముగ్గురు జాయింట్‌ కమిషనర్ల పాత్రపై వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు కూడా ఒప్పందం జరిగినట్లు తేటతెల్లమైంది. అందులో భాగంగా మొదటి దశలో.. ఏసీ టీవో, జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్‌ లొంగి పోయినట్టు ఉన్నతాధికారులు బయట పెట్టారు. రెండో దశలో.. ప్రధాన నిందితుడు, కేసులో సూత్రధారి అయిన ఏ1 శివరాజు, ఏ2 గా ఉన్న అతడి కుమారుడు సునీల్‌ లొంగి పోయేలా సహకరించేందుకు ప్రయత్నాలు చేశారని అధికారులు తెలిపారు.

బయటకు పొక్కడంతో..
సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ.. పైగా ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న ఈ కేసులో ముగ్గురు నిందితులు లొంగిపోయిన వ్యవహారంపై ఆరోపణలు బయటకు పొక్కాయి. దీనితో రెండో దశలో భాగంగా లొంగిపోవాలని ప్రయత్నించిన శివరాజు వ్యవహారంలో ఒప్పందం అడ్డం తిరిగింది. సీఐడీ ఉన్నతా ధికారులు సీరియస్‌గా స్పందించడంతో దర్యాప్తు అధికారులు శివరాజు కోసం వేట సాగించారు. తమిళనాడు సరిహద్దులో అదు పులోకి తీసుకోవడం, తీవ్ర ఒత్తిడికి గురైన శివరాజుకు గుండెపోటు రావడం.. ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే ఎక్కడా విషయం బయటకు పొక్కకుండా దర్యాప్తు అధికారులు ప్రయత్నించారని ఉన్నతాధికా రుల ద్వారా తెలిసింది. ప్రభుత్వ విభాగంలో వందల కోట్లు కాజేసిన కీలక కేసులోనే సీఐడీ అధికారులు ఇలా వ్యవహరించారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతోంది. ఇలాంటి అధికారుల తీరుపై సొంత విభాగం అధికారులే సిగ్గుపడుతున్నారు.

దర్యాప్తు అధికారిపై వేటుకు రంగం సిద్ధం
స్కాం దర్యాప్తు తీరు, కుంభకోణం జరిగిన పూర్తి వ్యవహారంపై సీఐడీ ఉన్న తాధికారులు సీఎం కేసీఆర్‌కు నివేదిక పంపి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. బోధన్‌లో మాత్రమే కాదని, ఇలా పలుచోట్ల 2010 నుంచి జరిమానాల సొమ్ము పక్క దారి పట్టినట్టు అనుమానాలున్నాయన్న విష యాన్ని సీఐడీ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. ప్రసుత్తం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న డీఎస్పీతో పాటు ఇద్దరు ఇన్‌ స్పెక్టర్లపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు డీజీపీ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. డీఎస్పీ స్థాయి అధికారిని సస్పెండ్‌ చేయడంతో పాటు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను కేసు నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలిపాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా కచ్చితమైన ఆదేశాలు వచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు